Anya’s Tutorial Trailer: రెజీనా ఖాతాలో మరో హిట్టు చేరినట్టేనా?

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటీ సరికొత్త వెబ్ సిరీస్ లతో, కొత్త సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఓటీటీలో జులై 1వ తేదీ నుంచి అన్యా’స్ ట్యుటోరియల్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్కా మీడియా, ఆహా కలిసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ లో రెజీనా, నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు.

దర్శకధీరుడు రాజమౌళి ట్రైలర్ ను లాంఛ్ చేయగా ఏడు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ గా అన్యా’స్ ట్యుటోరియల్ తెరకెక్కింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ కావాలనుకునే అన్య(నివేదితా) ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండగా అన్య అక్క మధు(రెజీనా)కు చెల్లి ప్రొఫెషన్ అస్సలు నచ్చదు. అయితే అన్య చేసిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతాయి. ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య కూడా పెరుగుతుంది.

అయితే ఆ తర్వాత అన్య జీవితంలో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అదే సమయంలో అన్యా’స్ ట్యుటోరియల్ ఫాలో అవుతున్న కొంతమంది పిల్లలు వాళ్ల ఇళ్లలో నుంచి మాయమవుతూ ఉంటారు. ఆ తర్వాత అన్య విచిత్రంగా ప్రవర్తించడంతో పాటు రెజీనా జీవితంలో కూడా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటాయి. అసలు అన్య, రెజీనా జీవితాలలో వచ్చిన మార్పులకు కారణమేంటి? అన్యా’స్ ట్యుటోరియల్ ను ఫాలో అయ్యే పిల్లలు ఏమయ్యారు? డిజిటల్ రంగం అందరినీ భయపెడితే ఏ విధంగా ఉంటుంది? అనే కథాంశంతో అన్యా’స్ ట్యుటోరియల్ తెరకెక్కింది.

అన్యా’స్ ట్యుటోరియల్ ట్రైలర్ కు యూట్యూబ్ లో బాగానే వ్యూస్ వస్తున్నాయి. హర్రర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను ఇష్టపడే వాళ్లను అన్యా’స్ ట్యుటోరియల్ కచ్చితంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆహా ఓటీటీలో తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ తో రెజీనా ఖాతాలో హిట్ చేరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus