Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విజయ రామరాజు (Hero)
  • సిజా రోజ్ (Heroine)
  • హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్ (Cast)
  • విక్రాంత్ రుద్ర (Director)
  • శ్రీని గుబ్బల (Producer)
  • విఘ్నేష్ బాస్కరన్ (Music)
  • జగదీష్ చీకాటి (Cinematography)
  • ప్రదీప్ నందన్ (Editor)
  • Release Date : ఆగస్టు 29, 2025
  • గన్నెట్ సెల్యులాయిడ్ (Banner)

టాలీవుడ్లో కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో ‘ఒక్కడు’ ‘కబడ్డీ కబడ్డీ’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కానీ అవి పూర్తిస్థాయిలో క్రీడా నేపథ్యం కలిగిన సినిమాలుగా పరిగణించలేం. కమర్షియల్ లవ్ స్టోరీస్..కి కబడ్డీ కలరింగ్ దిద్దారు అనుకోవాలి. అయితే చాన్నాళ్ల తర్వాత పూర్తి స్థాయి కబడ్డీ ఆట నేపథ్యంలో ఓ సినిమా రూపొందింది. అదే ‘అర్జున్ చక్రవర్తి’ (Arjun Chakravarthy). ఇది ఒక బయోపిక్ కావడం విశేషం. ట్రైలర్ తో కొంత అటెన్షన్ డ్రా చేయడంలో అయితే ఈ సినిమా సక్సెస్ అయ్యింది. మరి ట్రైలర్ తో వచ్చిన బజ్ ను క్యాష్ చేసుకునే విధంగా ఈ సినిమా ఉందో లేదో? తెలుసుకుందాం రండి :

Arjun Chakravarthy Movie Review

కథ: ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇది ఒక బయోపిక్. 1968 నుండి 1996 టైం పీరియడ్లో కథ నడుస్తుంది. అర్జున్ చక్రవర్తి (విజయ రామరాజు) ఓ అనాధ. చిన్నప్పుడు చెత్త బుట్టల మధ్యలో తిరిగే అతన్ని తీసుకొచ్చి సొంత మేనల్లుడిగా పెంచుకుంటాడు రంగయ్య (దయానంద్ రెడ్డి). ‘పరిస్థితుల ప్రభావం వల్ల పెద్ద కబడ్డీ ప్లేయర్ కాలేకపోయాను’ అని మానసిక కృంగిపోయే రంగయ్య.. అర్జున్ చక్రవర్తిని మాత్రం దేశం గర్వించదగ్గ కబడ్డీ ప్లేయర్ ని చేయాలనుకుంటాడు. కానీ అతను దేవిక (సీజ్ రోజ్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. దేవిక కూడా అర్జున్ ను గాఢంగా ప్రేమిస్తుంది. అయితే విషయం తెలుసుకున్న దేవిక కుటుంబ సభ్యులు ఆమెకు బలవంతంగా పెళ్లి చేసేస్తారు. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ చక్రవర్తి బాధ్యలో మద్యానికి బానిసైపోతాడు.

అయితే తన మామ రంగయ్య కోసం మామూలు మనిషి అయ్యి దేశం గర్వించదగ్గ కబడ్డీ ఆటగాడిగా ఎదుగుతాడు. ఊరంతా అతన్ని అభినందిస్తుంది. ప్రభుత్వం అతనికి డబ్బు, ఇల్లు బహూకరించి సత్కరిస్తుంది. దీంతో ఓ అకాడమీ పెట్టి చెత్త బుట్టలు చుట్టూ తిరిగే పిల్లలను, ఊర్లో ఉన్న పిల్లలను తనలా పెద్ద ఆటగాడిగా చేయాలని ఆశిస్తాడు. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్(అజయ్ ఘోష్) అర్జున్ కి దక్కాల్సిన డబ్బు, భూమిని నొక్కేసి అతన్ని పిచ్చివాడిలా ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటాడు. మరోపక్క అర్జున్ ను పెద్ద ఆటగాడిని చేయడానికి అతని మామ రంగయ్య ఇల్లు తాకట్టు పెట్టి మరీ అప్పు చేసి దానిని తీర్చలేక అనారోగ్యం పాలై మరణిస్తాడు. దీంతో అర్జున్ మరింతగా కుంగిపోయి తాగుడికి బానిసైపోతాడు. ఆ తర్వాత ఏమైంది? అర్జున్ కి సెకండ్ ఛాన్స్ దక్కిందా? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన దేవిక జీవితం ఎలా ఉంది? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: ‘పెదకాపు’, ‘మట్కా’ వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన విజయరామరాజు ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా చేయడం జరిగింది. లుక్స్ విషయంలో ఇతను తీసుకున్న శ్రద్ధ బాగుంది. లవ్ స్టోరీ టైంలో ఇతని ఎక్స్ప్రెషన్స్ అంతగా ఇంప్రెస్ చేయవు. కానీ ఎమోషనల్ సీన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. కబడ్డీ ఆడుతున్న టైంలో కనబరిచిన ఇంటెన్సిటీ కూడా కన్విన్సింగ్ గా ఉంది. దయానంద్ రెడ్డికి మరోసారి మంచి పాత్ర దొరికింది. తన పాత్రకి వంద శాతం న్యాయం చేశాడు ఇతను. కరెక్ట్ గా వాడుకుంటే రాబోయే రోజుల్లో ఇతను కూడా పెద్ద ఆర్టిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అజయ్ కి కూడా ఎక్కువ నిడివి కలిగిన పాత్ర దొరికింది. సీజ్ రోజ్ పాత్రకు తగ్గట్టు ఉంది. లుక్స్ కూడా డీసెంట్ గా అనిపిస్తాయి. అజయ్ ఘోష్ కనిపించింది కాసేపే అయినా తన మార్క్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. అతని ట్రాక్ వచ్చినప్పుడు ప్రేక్షకులకు కచ్చితంగా అతన్ని కొట్టాలి అనేంత కోపం వస్తుంది అనడంలో సందేహం లేదు. చిన్నప్పటి అర్జున్ చక్రవర్తిగా చేసిన రోషన్ కూడా అదరగొట్టాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు: స్పోర్ట్స్ డ్రామా తీయడం అంత ఈజీ కాదు. అలాంటిది నిజ జీవితంలో సంచలనం సృష్టించిన క్రీడా కారుల జీవితాలను తెరపై ఆవిష్కరించుకునే పని పెట్టుకుంటే చాలా శ్రద్ధతో తెరకెక్కించాలి. లేదు అంటే గొప్ప ఆటగాళ్ల పరువు తీసిపారేసినట్టు అవుతుంది. దర్శకుడు విక్రాంత్ రుద్ర అయితే అలాంటి తప్పు చేయలేదు అనే చెప్పాలి. అర్జున్ చక్రవర్తి జీవితాన్ని చాలా సహజంగా తెరకెక్కించడంలో అతను సక్సెస్ అయ్యాడు. అలా అని తప్పులు చేయలేదా? అంటే ఎందుకు చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో చాలా చోట్ల డాక్యుమెంటరీ ఫీలింగ్ కలుగుతుంది. లవ్ ట్రాక్ చూసినప్పుడు ల్యాగ్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. హీరో కబడ్డీ ఆడుతున్నప్పుడు అతన్ని కట్టడి చేసే ఆటగాడే లేడు అన్నట్టు ఎలివేషన్ ఇవ్వడం కొంచెం ఓవర్ ది టాప్ అనిపిస్తుంది.

హీరో ఎంత పొడుగ్గా ఉన్నా.. కబడ్డీ అనేది టెక్నిక్ తో ఆడే గేమ్ కాబట్టి.. అతన్ని కట్టడి చేసే ఆటగాళ్లు కూడా ఉన్నట్టు చూపించాలి. ఈ లోపాలు ఉన్నాయి కాబట్టే.. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంగ్తీగా అనిపిస్తుంది. అయితే సెకండాఫ్ లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చినప్పుడు అందరిలో ఓ అటెన్షన్ వస్తుంది. చెమట, రక్తం ధారపోసి ఆట ఆడి దేశానికి గౌరవం తీసుకొచ్చిన ఆటగాళ్లకు అధికారులు ఏ రకమైన అన్యాయం చేస్తారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. అందువల్ల అర్జున్ చక్రవర్తి పై సింపతీ పుట్టుకొస్తుంది. అదే చివరి సీన్ వరకు కూర్చునేలా చేస్తుంది. సంగీత దర్శకుడు విగ్నేష్ భాస్కరన్, సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి బాగా డ్యూటీ చేశారు. వారి కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాలకు చాలా బడ్జెట్ అయిపోతుంది. అయినా సరే నిర్మాత శ్రీని గుబ్బల వెనకడుగు వేయకుండా కథకు కావాల్సినవన్నీ సమకూర్చారు అనిపిస్తుంది.

విశ్లేషణ: మొత్తంగా ‘అర్జున్ చక్రవర్తి’ ఫస్ట్ హాఫ్ డాక్యుమెంటరీ ఫీలింగ్ ఇచ్చినా.. సెకండాఫ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉండటం వల్ల ఓవరాల్ గా పాస్ మార్కులు వేయించుకుంటుంది.

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus