Arjuna Phalguna Review: అర్జున ఫల్గుణ సినిమా రివ్యూ & రేటింగ్!

2021 చివర్లో విడుదలైన తెలుగు సినిమా “అర్జున ఫల్గుణ”. శ్రీవిష్ణు-అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి “జోహార్” ఫేమ్ తేజ మార్ని దర్శకుడు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మీద శ్రీవిష్ణు భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకోగలిగిందా? సినిమా ప్రేక్షకుల్ని అలరించగలిగిందా? అనేది చూద్దాం..!!

కథ: సరదాగా స్నేహితులతో కాలం గడిపే యువకుడు అర్జున్ (శ్రీవిష్ణు). తన స్నేహితుడు (మహేష్) అప్పులు తీర్చడానికి అరకు నుండి డ్రగ్స్ ఎగుమతికి సిద్ధపడతారు. వాళ్లకి అడ్డంకిగా మారతాడు పోలీస్ ఆఫీసర్ (సుబ్బరాజు). అసలు ఈ డ్రగ్స్ వాళ్ళు ఎలా ఎగుమతి చేస్తున్నారు? వాళ్ళ వెనుక ఉన్నది ఎవరు? డ్రగ్స్ అమ్మడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: శ్రీవిష్ణు నటుడిగా తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. సెటిల్డ్ ఎమోషన్స్ తో అలరించాడు. అయితే.. అతడి పాత్ర మునుపటి సినిమాల స్థాయిలో లేకపోవడంతో.. శ్రీవిష్ణు క్యారెక్టరైజేషన్ ఆకట్టుకోలేకపోయింది. రంగస్థలం మహేష్ కు మళ్ళీ మంచి పాత్ర దొరికింది. దాన్ని అతడు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాడు. అమృత అయ్యర్ అలరించింది.

సుబ్బరాజుకు చాన్నాళ్ల తర్వాత మంచి స్క్రీన్ ప్రెజన్స్ లభించింది కానీ.. క్యారెక్టర్ ఆర్క్ సరిగా లేకపోవడంతో ఆయన కష్టం వృధా అయ్యింది. శివాజీ రాజా, చైతన్య గరికిపాటి, దేవిప్రసాద్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్ పాటల కంటే నేపధ్య సంగీతం బాగుంది. ఇంటర్వల్ బ్యాంగ్ కి అతడు ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి హై ఇచ్చింది సినిమాకి. జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అరకు అందాలను చక్కగా చూపించాడు. టింట్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో మాత్రం చాలా లోపాలున్నాయి. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ను సరిగా డిజైన్ చేయలేదు. అలాగే.. సన్నివేశాల అల్లిక కూడా సోసోగా ఉంది. ఎడిటింగ్ ఈ సినిమాకి మెయిన్ విలన్ అయ్యింది.

దర్శకుడు తేజ మార్ని ఒక సాధారణ కథను, అసాధారణ కథనంతో నడిపించాలని చేసిన ప్రయత్నం బాగున్నప్పటికీ.. ఆచరణలో చాలా తప్పులు దొర్లాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో చాలా మైనస్ లు కనిపించాయి. క్యారెక్టర్స్ బాగా రాసుకున్నా వాటిని తెరపై ఆకట్టుకునే రీతిలో ప్రెజంట్ చేయలేకపోయాడు. దర్శకుడిగా బాగా తడబడినా.. రచయితగా పర్వాలేదనిపించుకున్నాడు. గోదావరి యాస డైలాగులు, కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. అన్నిటికంటే.. ఇంటర్వెల్ బ్యాంగ్ ను డిజైన్ చేసిన విధానం బాగుంది. అయితే.. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ప్రేక్షకుల్ని అలరించడంలో తడబడ్డాడు.

విశ్లేషణ: ఒక కంప్లీట్ కమర్షియల్ సినిమాకి కావాల్సిన హంగులన్నీ పుష్కలంగా ఉన్న సినిమా “అర్జున ఫల్గుణ”. శ్రీవిష్ణు పెర్ఫార్మెన్స్, నేపధ్య సంగీతం, ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం ఈ సినిమాని హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు. దర్శకుడు తేజ స్క్రీన్ ప్లేను ఇంకాస్త నీట్ గా రాసుకొని ఉంటే శ్రీవిష్ణు కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచేది చిత్రం.

రేటింగ్: 2/5 

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus