Avatar-The Way of Water Review: అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శామ్ వర్తింగ్టన్ (Hero)
  • జో సల్దానా (Heroine)
  • స్టీఫెన్ లాంగ్, కేట్ విన్ స్లెట్, సిగోర్ని వీవర్ తదితరులు (Cast)
  • జేమ్స్ కామెరూన్ (Director)
  • జేమ్స్ కామెరూన్, జోన్ లండా (Producer)
  • సిమోన్ ఫ్రాంగ్లన్ (Music)
  • మారో ఫియోర్ (Cinematography)
  • Release Date : డిసెంబర్ 12, 2022

ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న సినిమా “అవతార్”. 2009లో విడుదలైన మొదటి భాగం సృష్టించిన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అలాంటి సినిమాకి సీక్వెల్ గా విడుదలైన చిత్రం “అవతార్: ది వే ఆఫ్ వాటర్”. దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఏ స్థాయిలో అలరించిందో చూద్ధాం..!!

కథ: పండోరా గ్రహంలో మనుషులకు దూరంగా ప్రకృతితో కలిసి తన కుటుంబ సభ్యులతో జీవిస్తుంటాడు జేక్ సల్లీ. అయితే.. కల్నల్ మైల్స్ ప్రతీకారం తీర్చుకోవడం కోసం మరో అవతారంలో వచ్చి జేక్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో జేక్ తన కుటుంబంతో కలిసి కొత్త ప్లేస్ కి వెళతారు. మైల్స్ అక్కడికి కూడా వచ్చేస్తాడు. జేక్ & మెట్కైన వాసులు మైల్స్ ను ఎలా అడ్డుకొన్నారు? పండోరా గ్రహం నాశనం అవ్వకుండా ఎలా కాపాడుకొన్నారు అనేది “అవతార్: ది వే ఆఫ్ వాటర్” కథాంశం.

నటీనటుల పనితీరు: మనుషులుగా తక్కువ, అవతారాలుగా ఎక్కువగా నటులు కనిపిస్తుంటారు. అందువల్ల ఒకరు బాగా చేశారు, ఇంకొకరు బాలేదు అని చెప్పడానికి వీలులేని సినిమా ఇది. అయితే.. ఆడియన్స్ మాత్రం అందరి పాత్రలకు కనెక్ట్ అవుతారు.


సాంకేతికవర్గం పనితీరు: ఇప్పటివరకూ వచ్చిన టెక్నాలజీ బట్టి సినిమా స్థాయి పెరుగుతూ వచ్చింది. కానీ.. మొట్టమొదటిసారిగా సినిమా కోసమే టెక్నాలజీని సృష్టించారు. మరీ ముఖ్యంగా అండర్ వాటర్ షాట్స్ చూస్తుంటే మతి భ్రమిస్తుంది. అసలు అలా ఎలా తీయగలిగారు, ఎక్కడా గ్రాఫిక్స్ అని కూడా అనిపించదు. అంత పర్ఫెక్ట్ గా అండర్ వాటర్ సీన్స్ & నటుల ఎమోషన్స్ క్యాప్చ్యూర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అలాగే.. ఇప్పటివరకూ సినిమా అంటే సెకనుకి 24 ఫ్రేములు మాత్రమే చూడడం తెలుసు మనకు.

కానీ.. జేమ్స్ మొట్టమొదటిసారి సెకనుకి 48 ఫ్రేములతో షూట్ చేయడం వల్ల.. వార్ ఎపిసోడ్స్ & అండర్ వాటర్ సీన్స్ ను మనం చూసే విధానమే మారిపోయి.. ఒక తెలియని అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే టెక్నికల్ గా అవతార్ ఒక కొత్త ఒరవడి సృష్టించింది. భవిష్యత్ లో ఎవరైనా ఈ తరహా సినిమాలు చేయడానికి, ఈ టెక్నాలజీ వాడడానికి కనీసం సాహసమైనా చేస్తారా అనే ప్రశ్నకు ఇప్పట్లో సమాధానం దొరకడం కష్టం.

అలాగే కథకుడిగా జేమ్స్ తన గొప్పతనాన్ని తొలి భాగాన్ని, రెండో భాగాన్ని కనెక్ట్ చేసిన విధానంతోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ విధానం ఏమిటి అనేది లార్జ్ స్క్రీన్ మీద చూస్తేనే అర్ధమయ్యే అనుభూతి. ఇక ఈ సీక్వెల్ చాలా సాధారణమైన కథ, ఇంకా చెప్పాలంటే మనం సౌత్ లో ఈ తరహా కథలు చాలానే చూశాం. కానీ.. జేమ్స్ ఆ కథను విజువలైజ్ చేసిన తీరు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది.

సినిమాకు ల్యాగ్ ఎక్కువైంది అనిపించడం నిజమే కానీ.. ఆ ల్యాగ్ అనే పదం ఈ సినిమాకి ఉపయోగించడం సరి కాదు. ఎందుకంటే.. “అవతార్” ఒక సాధారణ సినిమా కాదు, ఒక అద్భుతం. ఆ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం, పండోరాలోని జీవాలను ఒక్కొక్కటిగా వాటి జీవన విధానాన్ని, ప్రకృతిపై ఆధారపడి సదరు జీవాలు జీవించే తీరు, వాటి జీవం కారణంగా ప్రకృతి ఎలా లాభపడుతుంది.

అలాగే.. మనిషి అనేవాడు ఎలాంటి గ్రహాన్నైనా తన ఈగో కోసం, లాభం కోసం నాశనం చేయడానికి ఎంతటికి తెగిస్తాడు వంటి విషయాల్ని విపులంగా వివరించడానికి కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నాడు జేమ్స్.. ఆ సమయం అవసరం కూడా. అందువల్ల సినిమా చూసే ఆడియన్స్ కాస్త ల్యాగ్ ఫీలవ్వచ్చు. కానీ.. ఆ ల్యాగ్ సినిమాకి అవసరం.


విశ్లేషణ: 192 నిమిషాల సినిమాను కథ కోసం కాక విజువల్స్ కోసం మాత్రమే చూడండి అని చెప్పడం నిజానికి తప్పే. కానీ.. “అవతార్” విషయంలో ఆ తప్పును చేయక తప్పడం లేదు. ఎందుకంటే సినిమా స్థాయి అలాంటిది. ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయామే అని తర్వాత బాధపడడం కంటే.. ఇప్పుడే మిస్ అవ్వకుండా థియేటర్లలో చూసేయడం ఉత్తమం.

రేటింగ్: 3.5/5 

Click Here To Read in ENGLISH

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus