ఒకవైపు కింగ్ నాగార్జున.. మరోవైపు నాగచైతన్య.. ఇంకోవైపు అఖిల్. టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా ఈ కాంబినేషన్ చూస్తున్నాం. తండ్రీ కొడుకులు ముగ్గురూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఒకే ఎరాలో ఇలా ఒక కుటుంబం నుండి ముగ్గురు హీరోలు సినిమాలు చేయడం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రేక్షకులు కూడా భలే ఫ్యామిలీరా బాబూ.. అంటే మెచ్చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదు. హీరో – అతని కొడుకు హీరో చూశాం కానీ.. ఇద్దరు కొడుకులు హీరోలుగా.. అది కూడా తండ్రి హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడే మన దగ్గర లేదు.
త్వరలో ఇలాంటి మరో ఫ్యామిలీని సినిమా పరిశ్రమలో అది కూడా మనకు దగ్గరైన ఇండస్ట్రీలోనే చూడబోతున్నామా.. అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ధనుష్ అనే చెప్పాలి. ఒక సినిమా అవ్వడం ఆలస్యం.. మరో సినిమా స్టార్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుండి ధనుష్ పెద్ద కొడుకు యాత్ర రాజా హీరో అవుతాడట. ధనుష్‌కి దగ్గర టీమ్‌లోని యంగ్ డైరక్టర్ ఒకరు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు వచ్చాయని చెబుతున్నారు.
అక్టోబరు 10, 2006న జన్మించిన యాత్ర.. అమెరికన్ ఇంట్రేషన్ స్కూల్ ఆఫ్ చెన్నైలో చదువుకున్నాడు. సినిమాటోగ్రఫీ మీద చాలా ఆసక్తి ఉందట. అలాగే ఆటలు బాగా ఆడతాడట. ఇక నటన అనేది కుర్రాడి రక్తంలోనే ఉంది. ఇదిలా ఉండగా ధనుష్ రెండో కొడుకు లింగా రాజా కూడా హీరో అవుతాడట. ఆ పనులు కూడా జరుగుతున్నాయట. కానీ దీనికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే లింగాకు 16 ఏళ్లే ఇప్పుడు. ఇటీవల ఓ ఈవెంట్‌లో లింగ కనిపించాడు మీకు గుర్తుండే ఉంటుంది. అదేనండీ ‘లింగా బేబీ ఇఫ్ యు ఆర్ బ్యాడ్.. ఐ యామ్ యువర్ డాడ్ అని ధనుష్ ఓ డైలాగ్ చెప్పాడు కదా. ఇక యాత్ర విషయాలన్నీ తేలాలంటే యాత్ర పుట్టిన రోజు రావాలి. ఆ రోజే సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.