తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ బాహుబలి సినిమాని ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించారంటే… అందుకు నిర్మాతలు శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని ల సహకారం ప్రధానమైంది. వారు ఈ కథని నమ్మి కోట్లు కుమ్మరించారు. నమ్మకం వమ్ముకోలేదు. రాజమౌళి కృషితో పాటు ప్రభాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, రానా, సత్యరాజ్, నాజర్ .. తదితరుల నటన, టెక్నీషియన్ల శ్రమ కలిసి బాహుబలి చిత్రాలు అద్భుత కళాఖండాలుగా నిలిచాయి. అందుకే తెలుగు భషలోనే కాకుండా అనువాదమై ప్రతి భాషలోనూ కలక్షన్ల వర్షం కురిపించింది. బాహుబలి కంక్లూజన్ అయితే ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ వసూలు చేసి తెలుగువారి ప్రతిభని ప్రపంచానికి చాటింది.
భారీ లాభాలు రావడంతో సేవా కార్యక్రమాలకు పూనుకున్నారు. తాజాగా వీరు గుంటూరు లోని మాచర్ల పట్టణంలో పేద విద్యార్థులకోసం శ్రీ సత్య సాయి బాబా స్కూల్ లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజనులంతా నిర్మాతలను అభినందిస్తున్నారు. వీరి స్పూర్తితో మరికొంతమంది లాభాలు వచ్చిన నిర్మాతలు సేవ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నారు.