బాలకృష్ణ సినిమా… అంటే డబుల్ రోల్!.. ఈ మాట మేం అనడం లేదు. గత కొన్ని రోజులుగా బాలయ్య సినిమాలు చూస్తే ఇదే మాట అనిపిస్తోంది. బాలయ్య రీసెంట్ హిట్ సినిమాల లిస్ట్ తీసుకుంటే ఈ కాన్సెప్ట్ మీకు బాగా కనిపిస్తుంది. రీసెంట్గా సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన ‘వీర సింహా రెడ్డి’లోనూ ఇదే పరిస్థితి. వీర సింహా రెడ్డి, జై సింహా రెడ్డి అంటూ రెండు పాత్రల్లో అలరించాడు బాలయ్య. ఇప్పుడు ఈ డబుల్ లెక్కలు ఎందుకు అనుకుంటున్నారా? రాబోయే సినిమాలో కూడా బాలయ్య డబుల్ రోల్ అని సమాచారం.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, అంజలి, శరత్ కుమార్ తదితరులు ఓ కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం చూస్తే.. ఈ సినిమాలో ఇద్దరు బాలకృష్ణలు ఉంటారట. సీనియర్ బాలకృష్ణ, జూనియర్ బాలకృష్ణ అనే హిట్ కాన్సెప్ట్‌ను ఈ సినిమాలోనూ వాడుకోవాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నారట. ఈ మేరకు బాలయ్య కూడా ఓకే చెప్పారు అని అంటున్నారు.
నిజానికి ఈ సినిమాలో ఓ యువ హీరో పాత్ర ఉందని, దాని కోసం చాలామంది పేర్లు అనుకుంటున్నారని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు యువ బాలకృష్ణ పాత్ర ఉంటుంది అని చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అని చెప్పలేకపోతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇద్దరు బాలకృష్ణలను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే ఫ్యాన్స్‌కి వచ్చే కిక్కే వేరు. మరి అనిల్ రావిపూడి ఏమనుకుంటున్నారో చూడాలి.
ఇక ఈ సినిమాలో కథానాయికగా కాజల్‌ను తీసుకున్నారని సమాచారం. అలాగే ఇందులో బాలయ్య తెలంగాణ యాస మాట్లాడతారు అని కూడా చెబుతున్నారు. ‘వీర సింహా రెడ్డి’ ప్రచారం పనులు పూర్తయిన నేపథ్యంలో బాలయ్య ఇకపై అనిల్ రావిపూడి సినిమాను స్పీడప్ చేస్తారు అని చెబుతున్నారు.