ముచ్చటగా మూడోసారి… బోయపాటి డైరెక్షన్లో రకుల్..?

బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ‘జయ జానకి నాయక’ చిత్రంతో పూర్తిగా కోలీవుడ్ వైపు మళ్ళింది రకుల్ ప్రీత్ సింగ్. మధ్యలో ‘స్పైడర్’ చిత్రం చేసినప్పటికీ అది కూడా చాలా వరకు తమిళ చిత్రమే… అనడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రం తరువాత… తెలుగులో రకుల్ కి అవకాశాలు కూడా లేవనే చెప్పాలి. సంక్రాంతికి విడుదలైన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రంలో కాసేపు శ్రీదేవిగా మెరిసింది. ఈ చిత్రంలో బాలయ్య-రకుల్ కాంబినేషన్ చూడడానికి కాస్త కష్టంగానే ఉందంటూ చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ సరసన ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా కనిపించబోతుందంట రకుల్ ప్రీత్ సింగ్.

బోయపాటి – బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే రకుల్ తో ‘సరైనోడు’ ‘జయ జానకి నాయక’ వంటి చిత్రాలు చేసిన బోయపాటి… రకుల్ మక్కువ చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. రకుల్ కూడా ఈ చిత్రం చేయడానికి ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. ఇందులో పెద్ద బాలకృష్ణ సరసన రకుల్ పాత్ర ఉండబోతుండగా… చిన బాలకృష్ణ సరసన ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ ను తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. పాత్ర ఉండేది కాసేపే అయినా.. దీనికోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట రకుల్. బాలయ్య సరసన హీరోయిన్లు దొరకడం కూడా.. ప్రస్తుతం కష్టంగా మారిన ఈ తరుణంలో… రకుల్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా చిత్ర యూనిట్ సిద్ధంగా ఉన్నారట. అయితే రకుల్ అప్పుడే సీనియర్ హీరోల సరసన నటించడానికి ఒప్పుకోవడం.. తన అభిమానులు తట్టుకోలేకపోతున్నారట. ఇక ఈ చిత్రాన్ని కూడా ‘ఎన్.బి.కె ఫిలిమ్స్’ బ్యానర్ పై బాలయ్యే నిర్మించబోతున్నారని సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంతో అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus