ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ హీరోగా యువ దర్శకుడు సిబి చక్రవర్తి దర్శకుడిగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తలైవా 173వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా తండ్రీ కొడుకుల నేపథ్యంలో ఉంటుందని, కొడుకు పాత్ర కోసం యువ హీరోన ఎంపిక చేసే పనిలో టీమ్ ఉంది అనేది ఆ వార్తల సారాంశం. ఇప్పుడు ఆ హీరో ఫిక్స్ అయ్యారు అని సమాచారం.
బాసిల్ జోసఫ్ .. మీకు తెలుసు కదా.. ‘జయ జయ జయ జయహే’, ‘నూనక్కుళి’, ‘సూక్ష్మదర్శిని’, ‘గురువాయూర్ అంబలనదాయిల్’, ‘ప్రవిణ్‌కుడు షాపు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయం ఉంది. అతనే ఇప్పుడు సిబి చక్రవర్తి సినిమాలో రజనీకాంత్ తనయుడిగా నటించబోతున్నాడు అని అంటున్నారు. త్వరలోనే ఈ విషయం అధికారికంగా అనౌన్స్ చేస్తారు అని చెబుతున్నారు. కమల్ హాసన్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు తొలుత సుందర్.సి దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చాయి. అయితే అధికారికంగా ప్రకటించిన కొన్ని రోజులకే ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత చాలా పేర్లు వినిపించినా.. ఆఖరుకు సిబి చక్రవర్తి కెప్టెన్ కుర్చీలోకి వచ్చారు. ఇక ఈ సినిమాలో ‘ఓజీ’ సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఓ కీలక పాత్రలో నటిస్తారు అని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్‌కి హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరట. కొన్నేళ్లుగా వయసుకు తగ్గట్లు మిడిల్ ఏజ్ రోల్స్ చేస్తున్న రజనీకాంత్ ఈ సినిమాలోనూ అలాంటి పాత్రనే చేస్తున్నారని సమాచారం.
ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్ – కమల్ హాసన్ కలసి నటించబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ఇటీవల ప్రకటించారు. 47 ఏళ్ల తర్వాత రజనీకాంత్ – కమల్ హాసన్ కలసి నటిస్తున్న సినిమా ఇది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.