మాస్ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఇరుముడి’. సినిమాలో భక్తి ఎలిమెంట్స్ ఉన్నా.. పూర్తిగా భక్తిరస చిత్రం అయితే కాదు. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్‌గా దట్టించారు అని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. దీంతో సినిమా మీద అంచనాలు బాగానే బిల్డ్ అయ్యాయి. దీంతో ఆదివారం జరగబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి అభిమానులు, ప్రేక్షకులు బాగా ఎదురుచూశారు. ఈవెంట్ అయ్యాక ‘అంతా ఓకే’ అనుకున్నా.. కొన్ని మాటలు మాత్రం ఇబ్బంది పెట్టాయి అని చెప్పాలి.
‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో రవితేజ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ ఆడిన కొన్ని మాటలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. మామూలుగా సినిమా వేడుకలోనే ఇలాంటి మాటలు తప్పు. ‘ఇరుముడి’ లాంటి అయ్యప్ప స్వామి భక్తులకు ఎంతో పవిత్రమైన పదాన్ని టైటిల్‌గా పెట్టుకున్న సినిమా విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. స్టేజీ మీద వారి మాటలను తిరిగి ఇక్కడ మనం ప్రస్తావించే రీతిలో లేవు కూడా. దీంతో స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు సభా మర్యాద పాటిస్తే బాగుంటుంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అంతే కాదు.. ఈ సినిమా గురించి టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. తన సినిమాల గురించి గొప్పగా చెప్పుకునే అలవాటు లేని దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమా విషయంలో పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇంతటి ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా ఇంత వరకు రాలేదని చెప్పారు. రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కొత్త రవితేజను చూస్తారని.. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా నచ్చేస్తుందని అన్నాడు.
సినిమా గురించి టీమ్ ఇలా గొప్పగా చెప్పుకోవడం కొత్తేమీ కాదు. అయితే ఇంతకుముందు విజయాలు లేని దర్శకుడు, హీరో ఇలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే సినిమాలు ఓపెనింగ్స్ బాగుంటాయి. అయితే ఇలాంటి మాటలు ఒక్కోసారి సినిమాకు ప్రెజర్‌ను తీసుకొచ్చి.. ఇబ్బంది పెడతాయి. ఇక పైన చెప్పిన ఆ అతి మాటలు కచ్చితంగా సినిమాను ఇబ్బంది పెట్టేవే..