జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందించాలనే తాపత్రయంతో ఏడాదికి కనీసం మూడు సినిమాలు విడుదల చేసే హీరో కమ్ ప్రొడ్యూసర్ విజయ్ ఆంటోనీ. ఆయన నటించి, నిర్మించిన తాజా చిత్రం “భద్రకాళి”. “అరువి, వాళ్” వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంథా క్రియేట్ చేసుకున్న అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ:
ప్రభుత్వ వ్యవస్థలోని లొసుగుల్ని చాకచక్యంగా అర్థం చేసుకొని, వాటి ఆధారంగా మీడియేటర్ హోదాలో కొందరికి మంచి చేస్తూ, ఎంతో మందికి సహాయం చేస్తూ.. ఓ ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతూ ఉంటాడు కిట్టు (విజయ్ ఆంటోనీ).
అయితే.. అతడు చేసేది కేవలం మీడియేషన్ కాదని, అంతకుమించి ఇంకేదో చేస్తున్నాడని గ్రహిస్తాడు అతడి బాస్ అభ్యంకర్ (సునీల్ క్రిప్లాని).
అసలు కిట్టు ఎవరు? అతడు చేస్తున్నది ఏంటి? ఎందుకని ప్రభుత్వం, రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు? అతడు సంపాదించిన డబ్బు మొత్తం ఏమవుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “భద్రకాళి” చిత్రం.
నటీనటుల పనితీరు:
విజయ్ ఆంటోనీ ఎప్పుడూ తన నటనా శక్తికి తగ్గ పాత్రలే ఎంచుకుంటాడు. మరీ ఎక్కువ పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కి కాస్త దూరం ఉంటాడు. “భద్రకాళి” కూడా ఆ తరహా చిత్రమే. అయితే.. ఈ చిత్రం నటుడిగా అతడిలోని పరిణితిని కొత్త విధంగా పరిచయం చేసింది. సబ్టల్ యాక్టింగ్ అనేది క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ కావడంతో.. విజయ్ ఆంటోనీ చాలా ఈజీగా కిట్టు అనే క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు.
పోలీస్ ఆఫీసర్ గా నటించిన కిరణ్ తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు. రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్ లా ఏదో స్ట్రిక్ట్ గా కనిపించకుండా.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ & స్టైలింగ్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. అతడి డైలాగ్ డెలివరీ కూడా బాగుంది.
అభ్యంకర్ గా కనిపించిన సునీల్ క్రిప్లాని స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. నిజమైన బ్యూరోకాట్ లానే ఉన్నాడాయన.
తృప్తి రవీందర్ నిస్సహాయతను, ఓపిక వంటి భావాలను కలగలిపి పలికించిన విధానం బాగుంది. ఆమెకు ఉన్న డైలాగులు తక్కువే అయినప్పటికీ.. హావభావాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.
సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలావరకు నోటీస్ అవ్వకుండా ఉండిపోతారు. కానీ.. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ ఎలివేట్ అయ్యారు. రియా జీతూ, సెల్ మురుగన్ వంటి నటులు తమ స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు:
అరుణ్ ప్రభు అనుకున్న కథలోని కోర్ పాయింట్ లో దమ్ముంది. ప్రభుత్వ వ్యవస్థల అలసత్వం మీద, రాజకీయ నాయకుల వ్యక్తిత్వం మీద, బ్యూరోకాట్లు దేశాన్ని దోచుకుంటున్న తీరుపై చాలా సూటి ప్రశ్నలు వేశాడు. అయితే.. ఆ ప్రశ్నలు కొత్తవా అంతే కాదు, ఆల్రెడీ పలువురు దర్శకులు ఇంతకంటే బలంగానే నిగ్గదీశారు. అయితే.. అరుణ్ ప్రభు స్క్రీన్ ప్లే ఇక్కడ మ్యాజిక్ క్రియేట్ చేసింది. హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం, దాన్ని రివీల్ చేసిన తీరు అదిరిపోయాయి. అయితే.. ఎంతో ఆసక్తికరంగా మొదలైన కథనం సెకండాఫ్ కి వచ్చేసరికి క్లాస్ పీకినట్లుగా ఉంటుంది. అలాగే.. క్లైమాక్స్ లో ఇచ్చిన జస్టిఫికేషన్ కూడా సరిగా వర్కవుట్ అవ్వలేదు. అయితే.. ప్రస్తుత రాజకీయ వ్యవస్థల మీద సంధించిన సెటైర్లు మాత్రం భలే పేలాయి. ఎంటర్టైన్మెంట్ & సెన్సేషనల్ న్యూస్ చాటున అసలు నిజాన్ని కొందరు ఎలా తొక్కేస్తున్నారు. జనాల మెదళ్లను ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది చూపించిన విధానం కచ్చితంగా ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా తాత పాత్రతో సమాజం శైలిని వివరించిన విధానం ప్రశంసార్హం.
టెక్నికల్ గా పెద్దగా లోటుపాట్లేమీ కనిపించలేదు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్ టాప్ లెవల్లో ఉన్నాయి. అలాగే.. ప్రొడక్షన్ డిజైన్ కూడా డీసెంట్ గా ఉంది.
విశ్లేషణ:
ఒక ప్రశ్నను సంధించినప్పుడు.. కుదిరితే దానికి సరైన సమాధానం ఇవ్వాలి, లేదంటే.. ఆ ప్రశ్నకు సమాధానం జనాలు ఆలోచించేలా వదిలేయాలి. అంతేకానీ.. రేకెత్తించిన మంచి ప్రశ్నకు ఏదో సమాధానం ఇవ్వాలి కాబట్టి, కమర్షియల్ జస్టిఫికేషన్ తో ముగించడం అనేది అనేది సంతృప్తినివ్వదు. అరుణ్ ప్రభు లాంటి దర్శకుడి నుండి మాత్రం ఇలాంటి జస్టిఫికేషన్ ఊహించలేదు. అందువల్ల.. ఆసక్తికరంగా మొదలైన ఫస్టాఫ్, సెకండాఫ్ కి వచ్చేసరికి మందగమనంగా సాగుతుంది. అందువల్ల ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో అలరించలేకపోయిందనే చెప్పాలి.
ఫోకస్ పాయింట్: ప్రశ్నకు తగ్గ సమాధానం ఇవ్వని భద్రకాళి!
రేటింగ్: 2.5/5