‘లెనిన్’ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఇన్నాళ్లూ అందరూ అఖిల్ గురించి మాట్లాడారు. ఈ సినిమా విజయం అఖిల్‌కి ఎలాగైనా దక్కాలి అంటూ కోరుకోని వారు లేరు. వారందరి విష్ కారణంగా, అఖిల్ కష్టం, సినిమా సత్త కారణంగా మంచి ఫలితమే వచ్చింది. అయితే ఈ సినిమా మరొకరికి కూడా చాలా కీలకం. ఆ వ్యక్తి ఈ రోజు సినిమా సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయ్యి.. కంటతడి పెట్టుకుంది. అవును మేం చెప్పేది భాగ్యశ్రీ బోర్సే గురించే.
‘లెనిన్’ సినిమాలో అఖిల్‌కు జోడీగా భారతి పాత్రలో నటించింది. సినిమా విడుదలకు ముందు చిత్రబృందంలో అందరూ ఈ సినిమాకు భాగ్యశ్రీ బోర్సే అసెట్ అవుతుంది అని చెబుతూనే ఉన్నారు. ఏదో చెప్పాలి కాబట్టి చెబుతున్నారేమో.. కమర్షియల్ మాస్ సినిమాలో హీరోయిన్‌కు అంత వెయిట్ ఉంటుందా అనుకున్నారు చాలా మంది. కానీ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరే వచ్చింది. అంతే కాదు ఆమె మూడేళ్ల కెరీర్‌లో తొలి విజయం కూడా వచ్చింది.
అంతుకే సినిమా సక్సెస్ మీట్‌లో భాగ్యశ్రీ మాట్లాడుతూ.. అభిమానులు తనను ప్రోత్సహిస్తూనే ఉన్నారని.. చిత్రబృందంతో పాటు వారి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ తనకు కర్మభూమి అని, తన ఆఖరి సినిమా కూడా తెలుగు సినిమా పరిశ్రమ నుండే ఉంటుందని ఎమోషనల్ అయింది. దీంతో ఈ వీడియో, ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2024లో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. ఆ తర్వాత వరుసగా ‘కింగ్డమ్’, ‘కాంతా’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలు చేసింది. అన్నిటికి హిట్ అనే టాక్ వచ్చినా ఏదీ విజయం సాధించలేదు. ఇప్పుడు ‘లెనిన్’కి కూడా హిట్ టాకే వచ్చింది. ఆ టాక్ నిలబెట్టుకుంటే అఖిల్‌కి, భాగ్యశ్రీకి కావాల్సిన విజయం వచ్చేస్తుంది. ఆమె కన్నీళ్లకు ఓ అర్థం ఉంటుంది.