భలే మంచి చౌక బేరం

చిన్న చిత్రాలకు పెద్ద దిక్కుగా మారిన మారుతి కథ అందించగా రూపొందిన చిత్రం “భలే మంచి చౌక బేరం”. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ కాపీ వచ్చి చాలా నెలలవుతున్నప్పటికీ.. రిలీజ్ అవ్వడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు భవ్య ఆనంద్ ప్రసాద్ సమర్పణలో విడుదలైంది. మరి ఈ కాన్సెప్ట్ ఫిలిమ్ ఎలా ఉందో చూద్దాం..!!

కథ : పార్ధు (నవీద్), సలీం (నూకరాజు) ఒక ఏజెంట్ దగ్గర దుబాయ్ వీసాల విషయంలో మోసపోయి హైద్రాబాద్ లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. ఒక ఎక్స్ ఆర్మీ మేన్ (రాజా రవీంద్ర) చాలా సీక్రెట్ గా పంపాలనుకొన్న ఒక ఫైల్ పొరపాటున నూకరాజు చేతిలో పడుతుంది. ఆ ఫైల్ లో ఉన్న మేటర్ మిలటరీ రహస్యాలని నమ్మి.. వాటిని టెర్రరిస్టులకు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకొంటారు. డీలింగ్ కూడా మాట్లాడేశాక కథ అడ్డం తిరుగుతుంది.

కథను అడ్డం తిప్పిన ఆ ట్విస్ట్ ఏంటీ అనేది సినిమాలో ముఖ్యాంశం కాగా.. పోలీసులు-టెర్రరిస్టుల నడుమ చిక్కుకున్న పార్ధు-సలీంలు ఆ బారి నుంచి ఎలా బయటపడ్డారు అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు : నవీద్ లుక్స్ పరంగా పర్వాలేదనిపించుకొన్నా.. నటన పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. నూకరాజు మాత్రం సిరాకు సలీం పాత్రలో కావాల్సినంత కామెడీ చేసి ప్రేక్షకుల్ని నవ్వించాడు. యామినీ భాస్కర్ సినిమాకు గ్లామర్ ను అద్దింది కానీ.. కథా గమనానికి మాత్రం ఉపయోగపడలేదు.

వీళ్ళందరికంటే ఎక్కువగా తన నటనతో సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలవడంతోపాటు.. స్క్రీన్ ప్రెజన్స్ తో ప్రధానాంశంగా నిలిచాడు రాజా రవీంద్ర. దేశభక్తితో రాజారవీంద్ర చెప్పే డైలాగ్స్ & ఫైనల్లో ట్విస్ట్ రివీల్ చేసే సన్నివేశం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు : బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఇది చిన్న సినిమా అనే ఫీల్ ను ఎక్కడా రానివ్వలేదు. హరి గౌర పాటలు సోసోగా ఉన్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. మారుతి ఇచ్చిన కథలో ట్విస్ట్ తప్పితే.. కథాంశం మాత్రం ఆకట్టుకొనే స్థాయిలో లేదు. దానికి దర్శకుడు మురళీకృష్ణ సెట్ చేసిన స్క్రీన్ ప్లే మాత్రం సినిమాకి మైనస్ గా నిలిచింది. అలాగే.. రాజారవీంద్ర సీనియారిటీ వల్ల అతను మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాడు కానీ.. మిగతా నటీనటుల నుంచి మాత్రం సరైన పెర్ఫార్మెన్స్ రాబట్టుకోలేకపోయాడు దర్శకుడు. అలాగే.. మంచి పొటెన్షియల్ ఉన్న కథని కూడా సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఆ కారణంగా సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయలేక చతికిలపడింది.

విశ్లేషణ : కాన్సెప్ట్ & ట్విస్ట్ తప్ప మరో ఆకట్టుకొనే అంశం లేని ఈ “భలే మంచి చౌక బేరం” బాక్సాఫీస్ వద్ద నిలబడడం చాలా కష్టం. ఆడియన్స్ మాత్రం టైమ్ పాస్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus