మన జీవిత కథలతో పాటు ఉపయోగించే వాహనాలకూ ఇందులో చోటుంటుంది. అప్పట్లో “కారు దిద్దిన కాపురం, కారా మజాకా” లాంటి సినిమాలు వస్తుండేవి.. ఇప్పుడా సంప్రదాయం కొద్దిగా మారి ద్విచక్రవాహనాల వైపు వచ్చింది. ఇటీవల కొన్నేళ్లలో బైక్‌లను ప్రాధాన్యంగా తీసుకొచ్చిన సినిమాల విశేషాలు చూస్తే..
యువతరానికి ద్విచక్ర వాహనాలతో ఉన్న అనుబంధం విడదీయలేనిది. తమ జీవితాల్లో బైక్ ను భాగంగా చూసుకుంటారు కుర్రకారు. సినిమాలో హీరోయిజం పండాలన్నా బండి ఉండాల్సిందే. అప్పట్లో నాని, తనీష్ హీరోలుగా నటించిన రైడ్ అనే సినిమా పూర్తిగా బైక్‌ల నేపథ్యంతో సాగుతుంది. కళాశాలలో చదివే యువకుడికి, ఉద్యోగంలో చేరిన అబ్బాయికి బైక్ ఎంత ప్రేమ ఉంటుందో చెబుతుందీ సినిమా. అర్జున్ రెడ్డి చిత్రంలో బుల్లెట్ తీసుకొచ్చిన ఆసక్తి అంతా ఇంతా కాదు. అప్పటిదాకా తను ఏ అమ్మాయినీ ప్రేమించలేదని చూచాయగా చెప్పేందుకు దర్శకుడు హీరో బుల్లెట్ బైక్ వెనక సీటు లేదని చూపిస్తాడు.
అంత స్వచ్ఛమైనది అర్జున్ రెడ్డి ప్రేమని చెబుతాడు. సినిమాలోని కళాశాల సన్నివేశాలు అన్నింట్లో ఈ బైక్ ప్రధాన అంశంగా ఉంటుంది. ఆర్‌ఎక్స్ 100 చిత్రం మూడు దశాబ్దాల కింద యువత కలల ద్విచక్రవాహనం పేరుతో వచ్చింది. ఈ సినిమాలోని ప్రేమ కథ ఎంతగా ఆకట్టుకుందో అందులో ఆ బైక్ కూడా అంతే పాత్ర పోషించింది. ఆర్‌ఎక్స్ 100 అనే పేరు పెట్టడమే చిత్రం పట్ల అంచనాలు పెంచింది. త్వరలో మరిన్ని బైక్ పాత్రలతో చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న రాజ్‌దూత్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రోచేవారెవరురా సినిమాలున్నాయి.