భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. బాలీవుడ్ ‘హీమ్యాన్’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ధర్మేంద్ర (89) ఇక లేరు. మరికొద్ది వారాల్లో (డిసెంబర్ 8న) 90వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఆయన, ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో కొన్నాళ్లుగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. కానీ విధిరాత మరోలా ఉండటంతో తుదిశ్వాస విడిచారు.
1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’తో ప్రయాణం మొదలుపెట్టిన ధర్మేంద్ర, సామాన్యుడి పాత్రల నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ‘షోలే’లో వీరూగా, ‘ధరమ్ వీర్’లో యోధుడిగా ఆయన చేసిన పాత్రలు చరిత్రలో నిలిచిపోతాయి. ఈ వయసులో కూడా ఆయన ఖాళీగా లేరు. షాహిద్ కపూర్ ‘తేరీ బాతో మే..’ సినిమాలో కనిపించారు. అమితాబ్ మనవడు అగస్త్య నందాతో కలిసి నటించిన ‘ఇక్కీస్’ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. దురదృష్టవశాత్తు అదే ఆయన చివరి చిత్రంగా మిగిలిపోనుంది.
ధర్మేంద్ర కేవలం నటుడు మాత్రమే కాదు, అంతకు మించిన తెలివైన వ్యాపారవేత్త. దాదాపు రూ. 335 కోట్ల సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించుకున్నారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే, హాస్పిటాలిటీ రంగంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలో ‘గరం ధరమ్’, కర్నాల్ హైవేపై ‘హీమ్యాన్’ పేరుతో రెస్టారెంట్లు, దాబాలు నడుపుతూ వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన స్టార్‌డమ్‌ని క్యాష్ చేసుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా.
ముంబై నగర జీవనానికి దూరంగా, లోనావాలాలోని తన 100 ఎకరాల ఫామ్ హౌస్‌లో గడపడానికే ధర్మేంద్ర ఎక్కువగా ఇష్టపడేవారు. అక్కడ వ్యవసాయం చేస్తూ, స్విమ్మింగ్ పూల్‌లో ఆక్వా థెరపీ తీసుకుంటూ ప్రకృతి ఒడిలో సేదతీరేవారు. ఇక కార్లంటే ఆయనకు మహా పిచ్చి. వింటేజ్ ఫియట్ నుంచి కోటి రూపాయల విలువైన రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి. ఇక ‘విజేత ఫిల్మ్స్’ బ్యానర్‌పై తన కొడుకులు సన్నీ, బాబీ డియోల్‌లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఒక బలమైన పునాదిని వేశారు. ఒక సామాన్య రైతు బిడ్డగా వచ్చి, బాలీవుడ్ రారాజుగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పవచ్చు.