ఆ సినిమాకు సీక్వెల్ రావడానికి 29 ఏళ్లు పట్టింది. ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ ఏంటి అన విసుర్లు మధ్యలో ఈ ఏడాది వచ్చిన ఆ సినిమా ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌కి ఉన్న స్పెషాలిటీ అదీ అంటూ అందరూ మెచ్చేసుకున్నారు. పనిలో పనిగా హీరోలు సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. ముఖ్యంగా 29 ఏళ్ల క్రితం సన్నీని తిరిగి చూసినట్లుంది అని ఫ్యాన్స్ సంబరపడ్డారు. మరో సీక్వెల్ వస్తే బాగుండు అని కూడా అనుకున్నారు.
అయితే, తొలి సీక్వెల్‌కే అన్నేళ్లు తీసుకున్నారు.. ఇప్పుడు మరో సీక్వెల్ అంటే కష్టమే అనుకున్నారంతా. కానీ వారందరికీ షాక్ ఇస్తూ సినిమా నిర్మాణ సంస్థ రెండో సీక్వెల్‌ని అంటే ‘బోర్డర్ 3’ని ప్రకటించేసింది. జేపీ ఫిల్మ్స్ పతాకంపై త్వరలో ‘బోర్డర్ 3’ ప్రారంభిస్తామని చెప్పేసింది. ఈ మేరకు నిర్మాత జేపీ దత్తా కుమార్తె, నిర్మాత నిధి దత్తా అధికారికంగా వెల్లడించారు. అయితే ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయం ఆమె చెప్పలేదు.
1971 నాటి ఇండియా – పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ‘బోర్డర్’ సినిమాలు తెరకెక్కుతున్నాయి. నాటి యుద్ధంలో మన సైనికులు చేసిన పోరాటాలను ఈ సినిమాలో ఘనంగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మూడో పార్టు విషయంలోనూ అదే బ్యాక్‌డ్రాప్ ఆలోచిస్తున్నారు అని చెబుతున్నారు. అయితే కథ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని, అయినప్పుడు బ్యాక్‌డ్రాప్ చెబుతారని టాక్.
తొలి ‘బోర్డర్’కు మొత్తంగా దత్తా ఫ్యామిలీనే అన్నీ చూసుకుంది. అంటే రచన, మాటలు, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, నిర్మాణం అన్నీ వారే చూసుకున్నారు. రెండో పార్టుకు వచ్చేసరికి జేపీ దత్తా కేవలంలో నిర్మాణంలోనే ఉన్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. కథను నిధి దత్తా ఇచ్చారు. ఇప్పుడు మరి మూడో పార్టు విషయంలో ఏం చేస్తారో చూడాలి.