Brahmanandam: కమల్‌ హాస్‌నును ఇమిటేట్‌ చేసిన బ్రహ్మానందం.. మాటలు వింటే నవ్వాగదు!

బ్రహ్మానందంలో నటన మాత్రమే కాదు చాలా కళలు ఉన్నాయి. అవి చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి. ఆయనలోని ఆర్టిస్ట్‌, బొమ్మలు చేసే పనితనం లాంటివి గతంలో మనం చూశాం. కొన్నిసార్లు సినిమాల్లో ఆయన మిమిక్రీ చేయడం కూడా చూసే ఉంటారు. ఇప్పుడు మరోసారి ఆయనలోని మిమిక్రీ ఆర్టిస్ట్‌ని బయటకు తీశారు. ఆయన నటించిన ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు. అక్కడే ఈ ఫీట్‌ చేశారాయన.

క‌మ‌ల్ హాస‌న్‌ (Kamal Haasan)  – శంక‌ర్  (Shankar)  కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’. సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’కి ఇది సీక్వెల్‌. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బ్రహ్మానందం మాట్లాడి, మిమిక్రీ చేసి ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో కమల్ హాసన్ గురించి అద్భుతంగా మాట్లాడటం గమనార్హం. కమల్ హాసన్, తాను సమకాలీకులం అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతుంటాను అని అన్నారు బ్రహ్మీ.

తాజ్ మహల్‌ని చూసినప్పుడు అందంగా ఉంటుందని అంటాం.. ఐఫిల్ టవర్‌ను చూసినప్పుడు ఎంత పొడవుగా ఉందో అంటాం.. అలానే కమల్ హాసన్‌ను చూసినప్పుడు ఎంత గొప్ప నటుడో అని అనాల్సిందే అంటూ తనదైన శైలిలో కమల్‌ను ఆకాశానికెత్తేశారు. కాలేజీ రోజుల్లో అందరూ ఏఎన్నార్, ఎన్టీఆర్‌ (Jr NTR)  వాయిస్‌లు మిమిక్రీ చేస్తే తాను మాత్రం కమల్ హాసన్ వాయిస్‌ను మిమిక్రీ చేసేవాడినని చెప్పరు మన మీమ్స్‌ నాయకుడు. శ్రుతి హాసన్‌ (Shruti Haasan) దగ్గర ఓసారి కమల్‌ వాయిస్‌ను మిమిక్రీ చేస్తే..

అచ్చం అప్పాలానే మాట్లాడుతున్నారే అని షాక్ అయిందని చెప్పారు బ్రహ్మీ (Brahmanandam). ఆ తర్వాత కమల్ హాసన్‌లా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన మిమిక్రీ చేస్తున్నంత సేపు కమల్ హాసన్ మురిసిపోవడం కొసమెరుపు. అలా అని బ్రహ్మీ.. గతంలో కమల్‌ మాట్లాడిన మాటలో, సినిమా డైలాగో మిమిక్రీ చేయలేదు. ఈ సినిమా ఈవెంట్‌కు వచ్చి కమల్‌ ఏం మాట్లాడతారు అనే విషయాన్నే మిమిక్రీ చేయడం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus