టాలీవుడ్ దర్శకుల్లో పూరి జగన్నాధ్ శైలి గురించి అందరికీ తెలిసిందే. టైటిల్ నుండి హీరో పాత్రచిత్రణ వరకు రఫ్ టఫ్ గా ఉంటాయి. ఇక ఇతగాడు రాసే మాటలైతే.. చెంప దెబ్బలే నయమనిపించేలా ఉంటాయి. వాటిలో బూతు కూడా భాగం పంచుకుంటుంది. బిజినెస్ మాన్ దీనికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. బూతు కూడా పూరి నోట్లో అందంగా ఉంటుందని ప్రకాష్ రాజ్ అన్నా ఆ అందానికి సెన్సార్ కత్తెర్లు పడుతూనే ఉంటాయి. బిజినెస్ మెన్ సినిమాకి ఎ సర్టిఫికెట్ ఇచ్చింది అందుకే మరి.
ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా పూరి తెరకెక్కించిన ‘ఇజం’ పైన వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ఇందులో పలు వ్యవస్థలను పూరి టార్గెట్ చేశాడని గుసగుసలు వినపడుతున్నాయి. వాటికోసం పూరి మళ్ళీ బూతు పురాణం పట్టుంటాడని అనుకున్నారు. అయితే కళ్యాణ్ రామ్ ఇచ్చిన వివరణతో వారి నోళ్లు మూతబడ్డాయి. పూరి ఈ సినిమాలో బూతు మాటలేం రాయలేదని అందుకే సెన్సార్ వాళ్ళు కూడా యు/ఎ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ఇందులో ఓ మాటని కత్తిరించారట. అయితే ఇది పూరి రాసింది కాదు ఆయన అభిమానించే శ్రీ శ్రీ రాసినది. “మహాప్రస్థానం”ను కొంపెల్ల జనార్ధన రావుకి అంకితం ఇస్తూ “తలవంచుకు వెళ్లిపోయావా నేస్తం”లో ‘దొంగలంజకొడుకులసలే మెసలే ఈ ధూర్తలోకాలో నిలబడజాలక’ అని రాశారు శ్రీశ్రీ. ఆ మాట ఇజంలో పూరి వాడగా అది కాస్త సెన్సారు కత్తెరకు బలైందట.