Kanthara 1: ‘కాంతార 1’కి పంజుర్లి శాపం.. హోంబలే నిర్మాత క్లారిటీ.. ఏమన్నారంటే?

‘కాంతార’ సినిమా ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమా షూటింగ్‌ ప్రారంభమైనప్పటి నుండి జరుగుతున్న చర్చ ‘ ఈ సినిమా విషయంలో ఏంటి అన్నీ ఇబ్బందికరంగా జరుగుతున్నాయి’ అని. మీరు కూడా ఈ విషయాల గురించి వినే ఉంటారు, చదివే ఉంటారు. సినిమా షూటింగ్‌ మొదలైనప్పటి నుండి సెట్‌లో, షూటింగ్‌ అయిపోయాక టీమ్‌కి వరుస ప్రమాదాలు, ఏదో రూపంలో షూటింగ్‌కు అడ్డంకులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో నిర్మాత చలువే శెట్టి స్పందించారు.

Kanthara 1

ఓ చిన్న కన్నడ సినిమాగా వచ్చి.. పాన్‌ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న చిత్రం ‘కాంతారా’. రూ.15 కోట్లతో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో భారీ విజయం సాధించి బాక్సాఫీస్‌ దగ్గర రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా గురించి వస్తున్న పుకార్ల గురించి మీరేమంటారు అని నిర్మాతల్లో ఒకరైన చలువే శెట్టి దగ్గర ప్రస్తావిస్తే.. సినిమా షూటింగ్‌ సందర్భంగా దురదృష్టవశాత్తూ చోటు చేసుకున్న సంఘటనలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను అని పూర్తి వివరాలు చెప్పారు.

సినిమా సెట్‌లో ఒకే ఒక అగ్ని ప్రమాదం జరిగిందని, మిగిలినవన్నీ సినిమాకు సంబంధం లేనివి అని స్పష్టం చేశారు . నవంబరు 2024లో కర్ణాటకలోని కొల్లూరు దగ్గర జరిగిన ప్రమాదంలో సినిమా బృందం కొన్ని గాయాలతో బయటపడింది. జనవరి 2025లో షూటింగ్‌ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇటీవల రిషబ్‌ శెట్టి, కొంతమంది టీమ్‌ సభ్యులు పడవ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. కెమెరాలు, ఇతర పరికరాలు నీటిపాలయ్యాయని తెలిపారు.

‘కాంతారా: చాప్టర్1’ ప్రకటన చేసే ముందే మేమంతా పంజుర్లిని కలసి దేవుడి నిర్ణయం ఎలా ఉంటుంది? అని అడిగాం. అప్పుడు ‘షూటింగ్‌లో కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. అయినా మీరు పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు’ అని సమాధానం వచ్చిందని చలువే శెట్టి తెలిపారు. వివిధ కారణాల వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యమవుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది. దీనికి ఎవరో ఒకరిని బాధ్యులను చేయలేం అని ఆయన అన్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus