రాజమౌళి మరచిపోయినా, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మరచిపోయినా.. చిరంజీవి మాత్రం గుర్తుంచుకున్నారు అనే ఓ మాట గత రెండు రోజులుగా తెగ వినిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ పురస్కారం వచ్చినందుకుగాను అందరూ టీమ్‌ను బాగా మెచ్చుకుంటున్నారు. ఆ సినిమా టీమ్ కూడా భలే ఆనందంగా తమకు తాము విషెష్ చెప్పుకుంటోంది. అయితే ఈ క్రమంలో సినిమాకు డబ్బులు పెట్టిన నిర్మాత పేరు ఎక్కడా చర్చకు కూడా రావడం లేదు. దీనిపై రకరకాల చర్చలు సాగుతున్న సమయంలో.. చిరంజీవి చేసిన పని అందరి చేత వావ్ అనిపిస్తోంది.
రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల చిరంజీవి కుటుంబం ఇండస్ట్రీలో సన్నిహితులకు పార్టీ ఇచ్చింది. పరిశ్రమలో దగ్గరైన వాళ్లు చాలామంది ఈ పార్టీకి వచ్చారు. అందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ కోర్ టీమ్ అందరినీ పిలిచారు. ఆ తర్వాత అందరికీ చిరంజీవి సన్మానం చేసి, అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో సత్కారం అందుకున్న వారిలో నిర్మాత డీవీవీ దానయ్య కూడా ఉన్నారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది లాగా దానయ్యను చిరంజీవి మరచిపోలేదు అని అంటున్నారు.
అయితే, చిరంజీవి ఎప్పుడూ మరచిపోవడం లాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అందరూ ఒకదారి.. ఆయన మాత్రం తనదైన దారిలోనే వెళ్తుంటాడు. ఇండస్ట్రీలో పంతాలు, పట్టింపులకు పోయి ఎవరికివారు అని హీరోలు ఉన్న సమయంలో అందరినీ కలుపుకుపోయేలా చేసింది చిరంజీవి. ఈ విషయాన్ని స్టార్ హీరోలే చెబుతారు. దర్శకుడికి, నిర్మాతకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేలా ఎప్పుడూ చూస్తుంటారు. అయితే గాడితప్పుతున్నారు అని తెలిస్తే వారికి చురకలు కూడా అంటిస్తారాయన. అలాంటి చిరు నిర్మాతను మరచిపోయే పరిస్థితి ఉండదు.
ఇక చిరంజీవికి (Chiranjeevi) దానయ్య బాగా సన్నిహితులు అని చెప్పొచ్చు. ఇద్దరి మధ్య గురుశిష్య బంధం ఉంది అని అంటుంటారు. కాబట్టి చిరంజీవికి దానయ్య అంటే అభిమానమే అని అంటుంటారు. అదే మరోసారి ఇప్పుడు సత్కారం రూపంలో కనిపించింది అనొచ్చు.