సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి వస్తే… ఆ సినిమాకు డబుల్ ప్రచారం లభిస్తుంది. ఈవెంట్‌కు వచ్చిన చిరంజీవి మొత్తం కాస్ట్ అండ్ క్రూ గురించి ఎలాగూ గొప్పగా చెబుతారు. దాంతో ఆ మాటలు టీమ్‌కి బూస్టప్ ఇస్తాయి. అయితే ఇటీవల కాలంలో చిరంజీవి ఇలాంటి ఈవెంట్లకు వస్తే లీక్‌లు కూడా వచ్చేస్తున్నాయి. ఆ సినిమా గురించో, ఆయన వచ్చిన సినిమా గురించో చిన్న చిన్న విషయాలు, ఒక్కోసారి బయటికొచ్చేస్తుంటాయి. అలా ‘లవ్‌స్టోరీ’ ఈవెంట్లోనూ లీక్‌లు వస్తాయేమో అనుకుంటే… షాక్‌లు వచ్చాయి.
వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ చేసేంతవరకు సాయి పల్లవి గురించి నాకు తెలియదు. ఆమె డ్యాన్స్ చేసిన ఓ పాట చూసి ఫిదా అయిపోయా. ఆ తర్వాత ఇటీవల ఓ సినిమాలో నాకు చెల్లెలిగా నటించేందుకు సాయిపల్లవి అయితే బాగుంటుందని చిత్ర బృందం అనుకుంది. అయితే నాకు మాత్రం వద్దు అనిపించింది. కానీ చిత్రబృందం ఆమెను సంప్రదిస్తా అంటే ఓకే అన్నాను. కానీ మనసులో మాత్రం సాయిపల్లవి ఒప్పుకోకూడదని అనుకున్నాను అని చెప్పారు చిరంజీవి. అంతేకాదు అలా ఎందుకు అనుకున్నారో కూడా చెప్పారు.
సాయిపల్లవి లాంటి కథానాయికకు అన్నగా నటించాలని నాకు అనిపించలేదు. మంచి డ్యాన్సర్‌తో కలసి నేనూ డ్యాన్స్ చేయాలనుకుంటాను కానీ… చెల్లెమ్మా ఎలా ఉన్నావు? అని ఎలా అనగలను అంటూ పెద్దగా నవ్వేశారు చిరంజీవి. అయితే ఆయన అనుకున్నట్లే సాయిపల్లవి ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. దీంతో చిరంజీవి హమ్మయ్య అనుకున్నారట. ఈ మాట చెప్పగానే ఆడిటోరియం మొత్తం నవ్వులు, విజిల్స్‌తో నిండిపోయింది. అయితే ఇంతలోనే ‘నేనేదో సరదాకి అన్నాను’ అంటూ మళ్లీ నవ్వేశారు చిరు. లీక్‌లు వస్తాయి అనుకున్న వాళ్లు… సాయిపల్లవికి ఇచ్చిన షాక్‌లు చూసి ఇంకా షాక్ అయ్యారు.