కేరాఫ్ కంచరపాలెం

ఎప్పుడు తీశారో, ఎలా తీశారో, కనీసం సినిమాలో ఎవరు నటించారో, ఎవరు తీశారో కూడా తెలియదు. అందరూ కొత్తవాళ్లే. వాళ్ళు కూడా నటులు కాదు జనాలు. విశాఖపట్నంకు చెందిన గవర కంచరపాలెం అనే గ్రామంలోని సగటు పౌరులను నటీనటులుగా మార్చి మహా వెంకటేష్ తెరకెక్కించిన చిత్రం “కేరాఫ్ కంచరపాలెం”. సినిమా అవుట్ పుట్ నచ్చడంతో రాణా ఈ ప్రొజెక్ట్ ను ఓవర్ టేక్ చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. రాణా సమర్పణలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీమియర్ షోస్ గత కొన్నాళ్లుగా హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరుగుతూనే ఉన్నాయి. చూసినోళ్ళందరూ “క్లాసిక్, మోడ్రన్ క్లాసిక్” అంటున్నారు. మరి అంతలా వాళ్ళని ఆకట్టుకొన్న అంశం ఏమిటి? ఈ సినిమా నిజంగానే మోడ్రన్ క్లాసిక్కా? కాదా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మా సమీక్షను చదవండి..!!


కథ: రాజు (సుబ్బారావు) 49 ఏళ్ల బ్యాచిలర్. ఓ గవర్నమెంట్ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేసే రాజుకి అదే ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన 42 ఏళ్ల రాధ (రాధ బెస్సీ) అనే లేడీ ఆఫీసర్ కి మధ్య ప్రేమ చిగురిస్తుంది. పెళ్లాడాలని ఇద్దరికీ ఉన్నా సమాజం ఏమనుకుంటుందో? కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో అన్న భయం వాళ్ళని వెంబడిస్తుంటుంది.

గెడ్డం (మోహన్ భగత్) వైన్ షాప్ లో పనిచేసే కుర్రాడు. తాను పని చేసే వైన్ షాప్ కి రోజూ వచ్చి మేన్షన్ హౌస్ క్వార్టర్ బాటిల్ కొనే ఓ అమ్మాయిని కళ్ళు తప్ప కనీసం మొహం కూడా చూడకుండా ప్రేమిస్తాడు. తర్వాత ఆమె ఓ తురక పిల్ల అని ఆమె పేరు సలీమా (ప్రవీణ పరుచూరి) అని, ఆమె ఓ వేశ్య అని తెలుసుకొంటాడు. కానీ.. ఆమె మీద పెంచుకొన్న ప్రేమ-అభిమానం ఆమె వృత్తి గురించి గెడ్డాన్ని ఎక్కువ ఆలోచించనివ్వదు. రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వాలని ఫిక్స్ అవుతారు.

జోసెఫ్ (కార్తీక్ రత్నం) ఓ జులాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో.. ఊర్లోని ఒక రౌడీ కమ్ హనుమాన్ వ్యాయామశాల ఓనర్ అయిన అమ్మోరు దగ్గర డబ్బు కోసం చిన్న చిన్న రౌడీ పనులు చేస్తూ తన స్నేహితులతో టైమ్ పాస్ చేస్తుంటాడు. ఒక గొడవలో పరిచయమైన భార్గవి (ప్రణీత పట్నాయక్) అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాలని ఫిక్సవుతాడు.

సుందరం (కేశవ కర్రి) ఏడేళ్ళ బాలుడు. తనతోపాటు చదువుకొనే సునీత (నిత్యశ్రీ గోరు) అనే చిన్నారిని మనస్ఫూర్తిగా ఇష్టపడతాడు. ఆమె కూడా తనను ఇష్టపడేలా చేయడం కోసం చాలా కష్టపడుతుంటాడు. ఆ క్రమంలో తనకు తెలియకుండానే కోపంలో చేయకూడని పెద్ద తప్పు చేస్తాడు. తాను కోపంతో చేసిన తప్పుకు తన కుటుంబం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.

ఈ నలుగురి జీవితాలే “కేరాఫ్ కంచరపాలెం” కథాంశం.


నటీనటుల పనితీరు: ఒక్క మోహన్ భగత్, కార్తీక్ రత్నంకి తప్ప సినిమాలో నటించిన ఏ ఒక్కరికీ కనీసం కెమెరా ముందుకు వచ్చిన అనుభవం కూడా లేదు. కానీ.. వారి నటన, వ్యవహారశైలి చూస్తే.. వీళ్ళందరూ ఏదైనా ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఫిలిమ్ స్కూల్లో నటనకు సంబంచిన కోర్సు కంప్లీట్ చేసుకొని వచ్చి కెమెరా ముందు జీవించారేమో అనిపిస్తుంది.

సినిమాలోని నాలుగు కీలకపాత్రలైన రాజు, గెడ్డం, జోసెఫ్, సుందరంల పాత్రలు, వాటి ప్రవర్తనకి ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక చోట కనెక్ట్ అవుతాడు.
అయితే.. అందరిలో ది బెస్ట్ ఎవర్రా అంటే మాత్రం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మరో ఆలోచన లేకుండా చెప్పే పేరు రాజు పాత్రలో జీవించిన సుబ్బారావు. ఆయన పెద్దగా నవ్వడు కానీ.. ఆయన పాత్ర సృష్టించే ఆరోగ్యకరమైన హాస్యం మాత్రం ప్రేక్షకుల్ని మనసారా నవ్విస్తుంది. ఆయన ఏ ఒక్క సన్నివేశంలోనూ కన్నీరు పెట్టడు కానీ ఆయన కళ్ళలో పలికే హావభావాలు మాత్రం మన మనసుల్ని తడిపేస్తాయి.
అలాగే.. చిత్ర నిర్మాతగా నిర్మాణ బాధ్యతలు చూసుకోవడమే కాకుండా ఈ చిత్రంలో సలీమా అనే తురక వేశ్య పాత్ర పోషించిన ప్రవీణ పరుచూరి పాత్ర మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది.
చూడ్డానికి రెండడుగులుంటాడు కానీ.. సుందరం పాత్రలో అమ్మాయి మెప్పు పొందడం కోసం వెంపర్లాడే కుర్రాడిగా కేశవ కర్రి కూడా సహజమైన నటనతో ఆకట్టుకొన్నాడు.
ఆధునిక భావాలు కలిగిన యువతి భార్గవిగా ప్రణీత పట్నాయక్, పెళ్ళైన కొత్తలోనే భర్తను పోగొట్టుకొని 42 ఏళ్ల వయసులో తనకు శారీరికంగా కాక మానసికంగా తోడు కావాలని నిర్ణయించుకొన్న ఇండిపెండెంట్ లేడీ రాధగా రాధా బెస్సీలు నేటి తరం అమ్మాయిలకు, మహిళలకు స్పూర్తిగా నిలుస్తారు.
ఇలా సినిమాలో.. ప్రధాన పాత్రలు మొదలుకొని దండోరా వేసే ముసలాయన పాత్ర వరకూ అన్నీ గుర్తుండిపోతాయి. అందరూ కొన్ని రోజులపాటు మన ఆలోచనల్లో మెదులుతూనే ఉంటారు. నటీనటులుగా వాళ్ళు ప్రేక్షకుల మెదళ్ళలో-మనసుల్లో సంపాదించుకొన్న స్థానం కంటే ఎక్కువగా సాధించేది ఏముంటుంది?


సాంకేతికవర్గం పనితీరు: “కేరాఫ్ కంచరపాలెం” సినిమా ఇంత సహజమైన అనుభూతిని కలిగించడానికి కారణం ఏదైనా ఉంది అంటే.. అది సంగీత దర్శకుడు స్వీకర్ ఆగస్థి పాటలు-నేపధ్య సంగీతమే. చెవులు హోరెత్తించే రాక్ మ్యూజిక్ లేదు, భారీస్థాయి సంగీత పరికరాలూ వాడలేదు. ఉన్నదల్లా సన్నివేశానికి తగిన నేపధ్య సంగీతం. పచ్చని పైరు గాలి మొదటిసారి చెవులకి తాకితే వినిపించే సుమధురమైన కృష్ణుడి వేణుగానంలా మనసుకి హాయినిచ్చే ఆ నేపధ్య సంగీతం, అందుకు తోడైన పాటలు, ఆ పాటలకి అద్దిన అద్భుతమైన సాహిత్యం. అన్నీ కలగలిసి “కేరాఫ్ కంచరపాలెం” చిత్రానికి ప్రాణ ప్రతిష్ట చేశాయి.

వరుణ్ చపేకర్-ఆదిత్య జవ్వాది ఈ ఇద్దరు ప్రతిభాశాలుల పేర్లు మన భవిష్యత్ లో చాలా ఎక్కువగా వింటాం. కేవలం డి.ఎస్.ఎల్.ఆర్ కెమెరాతో ఈ సినిమా తీశారు అంటే నమ్మడం అసాధ్యం. అంత ఆశ్చర్యకరమైన అవుట్ పుట్ ఇచ్చారు ఈ ఛాయాగ్రహక ద్వయం. అబ్బో అనిపించే ఫ్రీజ్ ఫ్రేమ్స్ లేవు, అమ్మో అనిపించే బుల్లెట్ టైమ్ షాట్స్ లేవు. కానీ.. సినిమా చూస్తున్నంతసేపు థియేటర్లో కాకుండా కంచరపాలెం గ్రామం నడిమధ్యనున్న రచ్చబండ మీద మంచి నవారు కుర్చీ వేసుకొని కూర్చున్నట్లుగా ఉంటుంది. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల్ని సినిమాలోకి అంత అద్భుతంగా లీనం చేశారు ఈ ఛాయాగ్రాహకులు.

కనిపించడానికి, చెప్పడానికి “కంచరపాలెం” సినిమా చాలా సింపుల్ గా కనిపిస్తున్నా.. చాలా క్లిష్టమైన సబ్జెక్ట్. కానీ ప్రేక్షకుల మెదడు ఎక్కడా ఆలోచించదు, సినిమాలోని ఒక ఫ్లో ప్రకారం ప్రేక్షకుడు సినిమాతో ప్రయాణిస్తుంటాడు. అందుకు కారణం రవితేజ గిరిజాల ఎడిటింగ్. ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ ను సింపుల్ గా ప్రేక్షకులకి అర్ధమయ్యేలా ఎడిట్ చేయడం ఎలా? అనే ప్రశ్నకు ఒక టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ లా “కేరాఫ్ కంచరపాలెం” చిత్రాన్ని ఎడిట్ చేశాడు రవితేజ.

నిర్మాత ప్రవీణ పరుచూరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చిత్రానికి నిర్మాత కావడమే కాకుండా సినిమాలో కీలకమైన సలీమా అనే వేశ్య పాత్ర పోషించిన ప్రవీణ వృత్తిరిత్యా అమెరికాలో కార్డియాలజిస్ట్. తెలుగు సినిమా మీద ఆమెకు ఉన్న అభిమానం ఆమెను అమెరికా నుంచి ఇండియాకి రప్పించి “కేరాఫ్ కంచరపాలెం” అనే అద్భుతమైన-సహజమైన తెలుగు సినిమాని నిర్మించడానికి దోహదపడింది. అందుకు ఆమె కళాతృష్ణకు కళామ్మతల్లి ఎప్పటికీ ఋణపడి ఉంటుంది.

ఇక దర్శకుడు మహా వెంకటేష్ గురించి మాట్లాడుకోవాలి..
కమర్షియల్ సినిమా, డిఫరెంట్ సినిమా, బోల్డ్ సినిమా, కల్ట్ సినిమా అంటూ నవతరం దర్శకులందరూ క్రియేటివిటీ ఎక్కువయ్యి నానా యాగీ చేస్తుంటే.. ఈ వెంకటేష్ మహా ఏంటో విచిత్రంగా “సహజమైన సినిమా” అంటూ “కేరాఫ్ కంచరపాలెం” చిత్రాన్ని తెరకెక్కించాడు. ఒక లిప్ లాక్ లేదు, ఒక ఫైట్ లేదు, ఏ ఒక్క సన్నివేశంలోనూ హీరో పనిగట్టుకొని హీరోయిన్ వెనుక తిరగడు, ఆమెను ఏడిపించడు. కనీసం సపరేట్ కామెడీ ట్రాక్ లు కూడా లేవు. ఇవేమీ లేకుండా వెంకటేష్ మహా “కేరాఫ్ కంచరపాలెం” అనే చిత్రాన్ని అంత ధైర్యంగా.. ముఖపరిచయం కూడా లేని ఆర్టిస్టులతో ఎలా తీశాడు? ఏ నమ్మకంతో తీశాడు? అనే ప్రశ్న సినిమాను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఇంటికి చేరుకున్నాక మన మెదడులో మెదులుతూ ఉంటుంది.
అతడికి అంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు కానీ.. తెలుగు సినిమా అనే కిరీటంలో “కేరాఫ్ కంచరపాలెం” అనే వజ్రాన్ని సునాయాసంగా జొప్పించేశాడు. అంతమంది కొత్త నటీనటుల నుంచి సహజమైన నటన రాబట్టుకొన్న అతడి ఓర్పుకు, తాను తీసిన మంచి సినిమాను విడుదల చేయడం కోసం అతడు పడిన శ్రమకు చేతులెత్తి నమస్కరించినా తప్పులేదు. సినిమాలో ఎక్కడా కూడా హాస్యాన్ని, ఎమోషన్స్ ని ఇరికించలేదు. సన్నివేశంతోపాటే అవి కూడా వచ్చాయి.
అదృష్టం కలిసొచ్చో లేక కళామ్మతల్లి దీవెనెల వల్లనో సురేష్ బాబు, రాణా వంటి వారి అండ-దండ లభించి “కేరాఫ్ కంచరపాలెం” చిత్రం ఇంత పబ్లిసిటీ సంపాదించగలిగింది కానీ.. లేదంటే ఈ చిత్రాన్ని కూడా చాలా మంచి సినిమాల్లా ఏ యూట్యూబ్ లేదా అమేజాన్ ప్రైమ్ లో చూసి “అరె ఈ సినిమా ఎప్పుడు రిలీజైంది? థియేటర్లో చూడలేకపోయానే” అని ప్రతి తెలుగు సినిమా అభిమాని బాధపడే పరిస్థితి ఏర్పడేది.


విశ్లేషణ: మలయాళంలో “ప్రేమమ్”, కన్నడలో “వెంటిలేటర్, కిరాక్ పార్టీ”, తమిళంలో “డి 16”, హిందీలో “పీకూ” లాంటి సినిమాలు చూసి మన తెలుగులో మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలతో, స్వచ్చమైన భావాలతో సహజమైన తెలుగు సినిమా ఎందుకు రాదు అని తనలో తాను ప్రశ్నించుకుంటూ బాధపడే ప్రతి తెలుగు సినిమా అభిమానికి దొరికిన సమాధానం “కేరాఫ్ కంచరపాలెం”. ఈ సినిమాని థియేటర్ కి వచ్చి చూసి ఆదరించాల్సిన బాధ్యత ప్రతి తెలుగు ప్రేక్షకుడిది. ఇలాంటి సినిమాల్ని గనుక ఆదరించకపోతే అవే రొటీన్ రొట్ట సినిమాలు చూసుకుంటూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా.. సహజత్వాన్ని మించిన అందం ఏముంటుంది చెప్పండి. ఆ సహజత్వాన్ని ఆస్వాదించండి, ఆనందించండి. కుదిరితే.. ఇంకో పదిమందికి చూడమని చెప్పండి.

రేటింగ్: 4/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus