పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తొలిసారి జానపద నేపథ్యంలో తెరకెక్కిన హిస్టారికల్ జానర్ లో నటించిన సినిమా “హరిహర వీరమల్లు” (Hari Hara Veera Mallu). క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేయగా.. దాదాపు 5 ఏళ్లపాటు ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. సినిమా విడుదల పోస్ట్ పోన్ అవ్వడానికి కారణాలు కోకొల్లలు అయినప్పటికీ.. ఎట్టకేలకు నేడు (జూలై 24) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ.ఎం.రత్నం ఎంతో రిస్క్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం హిట్ అవ్వడం అనేది చాలా కీలకం. మరి “హరిహర వీరమల్లు” (Hari Hara Veera Mallu) ఆ కమర్షియల్ సక్సెస్ ను అందుకోగలిగిందా? నిర్మాతగా రత్నంకి సక్సెస్ దక్కిందా? అనేది చూద్దాం..!!
కథ: ఉన్నవాళ్ళని దోచి లేని వాళ్లకి పంచే 16వ శతాబ్దపు రాబిన్ హుడ్ గా ప్రజల మన్ననలు అందుకున్న హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్)కు ముఘల్ సైన్యం నుంచి వజ్రాలు చోరీ చేసే పని అప్పజెబుతాడు చిన్నదొర (సచిన్ కేడ్కర్). ఆ క్రమంలోనే పంచమి (నిధి అగర్వాల్)తో పరిచయం జరుగుతుంది.
వజ్రాలతోపాటు పంచమిని కూడా చిన్నదొర చెర నుంచి విడిపించాలనుకున్నాడు వీరమల్లు.
ఆ క్రమంలో అనుకోని విధంగా ఎదురుదెబ్బ తగులుతుంది. వీరమల్లును బంధించిన హైదరాబాద్ చక్రవర్తి, దిల్లీలోని ఎర్రకోటలో ఔరంగజేబు ఆధీనంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా కోరతాడు.
దాంతో ఢిల్లీ ప్రయాణమైన వీరమల్లు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా ఎదిరించాడు? ఔరంగజేబును ఓడించి, కోహినూర్ ను తీసుకురాగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే “హరిహర వీరమల్లు” చిత్రం.
నటీనటుల పనితీరు: మొదటిసారి జానపద పాత్ర పోషించినా నేపథ్యం తెలంగాణ కావడంతో చాలా ఈజ్ తో పాత్రలో ఒదిగిపోయాడు పవన్ కల్యాణ్. కళ్యాణ్ మార్క్ యాక్షన్ సీక్వెన్సులు బోలెడు ఉండగా.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే పులి, నక్క సీక్వెన్సులు బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వయంగా కంపోజ్ చేసిన చౌకీదానా ఫైట్ సీన్ చాలా రియలిస్టిక్ గా ఉంది. కాకపోతే.. పవన్ కళ్యాణ్ లుక్స్ లో చాలా చేంజెస్ ఉండడం అనేది కాస్త ఇబ్బందిపెట్టే విషయమే. దాన్ని కవర్ చేయడానికి జ్యోతికృష్ణ “కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత” అని స్లైడ్స్ వేసినప్పటికీ.. కంటిన్యూటీ మిస్ అవ్వడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
నిధి అగర్వాల్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. ఆమె పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ కూడా వర్కవుట్ అయ్యింది. అయితే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుత పొలిటికల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని పెద్దగా కెమిస్ట్రీ వర్కవుట్ చేసే సన్నివేశాలు ఏమీ ఇరికించలేదు. ఆమె పడిన 5 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దొరికిందనే చెప్పాలి.
ఔరంగజేబుగా బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజన్స్ సరిగ్గా సరిపోయింది. అతడి ముఖంలోనే విలనిజం బాగా పండింది. అయితే.. బాబీ డియోల్ & పవన్ కళ్యాణ్ మధ్య కాంబినేషన్ సీన్స్ మాత్రం ఏమీ లేవు. వాటి కోసం సెకండ్ పార్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి.
రఘుబాబు, నాజర్, సునీల్, సుబ్బరాజు పాత్రలతో పండించిన కామెడీ ఓ మోస్తరుగా బానే ఉండగా.. కబీర్ దుహాన్ సింగ్, అయ్యప్పశర్మ పాత్రలతో స్క్రీన్ ప్లే వేగాన్ని పంచే ప్రయత్నం బాగుంది.
సాంకేతికవర్గం పనితీరు: కీరవాణి ఈ సినిమాకి ప్రాణవాయువు అని పదే పదే పవన్ కళ్యాణ్ రెండురోజులపాటు చెబితే ఏదో అనుకున్నాం కానీ.. సినిమా చూశాక నిజమే అనిపిస్తుంది. సన్నివేశంలో ఏమాత్రం దమ్మున్నా కీరవాణి ఆ సన్నివేశాన్ని, సందర్భాన్ని మరింత ఆసక్తికరంగా మార్చారు. నేపథ్య సంగీతంతోనే సగం సినిమాని కాపాడారు కీరవాణి.
సినిమాటోగ్రఫీ వర్క్ గురించి కాస్త తక్కువే మాట్లాడాలి. ఇద్దరు టెక్నీషియన్స్ కావడంతో ఎవరి పార్ట్ ఏది అనేది చెప్పలేం కానీ.. సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం కెమెరా వర్క్ చాలా పేలవంగా ఉంది. ముఖ్యంగా సీజీ వర్క్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఈమధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో పూరెస్ట్ సీజీ వర్క్ “హరిహర వీరమల్లు” అనే చెప్పాలి. ఆ గుర్రాల సీక్వెన్సులు కానీ, క్లైమాక్స్ లో వచ్చే గాలి తుఫాను సీక్వెన్స్ కానీ చాలా చీప్ గా ఉన్నాయి. ఒక స్టార్ హీరో సినిమాకి ఈ స్థాయి పేలవమైన గ్రాఫిక్స్ వర్క్ ఇప్పటివరకు చూడలేదు.
తోట తరణి ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. చాలావరకు బాగానే మ్యానేజ్ చేసారు. మినిమల్ సెట్ వర్క్ తోనే ప్రాజెక్ట్ ను పూర్తిచేయగలిగారు.
దర్శకుడు క్రిష్ పనితనం మొత్తం ఫస్టాఫ్ లో కనిపిస్తుంది. చాలా చక్కగా ప్యాక్ చేశారు ఫస్టాఫ్ ను. సెకండాఫ్ కి వచ్చేసరికి సినిమా చల్లబడిపోయింది. కథ కోర్ పాయింట్ బాగున్నప్పటికీ.. సెకండాఫ్ లో దాన్ని జ్యోతికృష్ణ డీల్ చేసిన విధానం మైనస్ గా మారింది. అసలు సినిమాకి కీ పాయింట్ గా నిలవాల్సిన సెకండ్ పార్ట్ క్లిఫ్ హ్యాంగర్ మూమెంట్ ను అంత సిల్లీగా డిజైన్ చేయడం అనేది మరో పెద్ద మైనస్. ఓవరాల్ గా.. ఫస్టాఫ్ లో క్రియేట్ చేసిన హైప్ సెకండాఫ్ అందుకోలేకపోయిందనే చెప్పాలి.
విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసినప్పుడు ఏమాత్రం బాగున్నా భలే ఉందే అనే భావన కలిగిస్తుంది. “హరిహర వీరమల్లు” ఫస్టాఫ్ సరిగ్గా అలాంటి ఫీలింగ్ ఇచ్చింది. ఇంటర్వెల్ బ్యాంగ్ పడేసరికి “పవన్ కళ్యాణ్ కి మరో హిట్టు పక్కా” అనే భావన కలిగింది. కట్ చేస్తే.. కాస్త స్లోగా స్టార్ట్ అయిన సెకండాఫ్ సగం మంచి కథనం, ఎంగేజింగ్ డ్రామా లేక బోర్ కొడితే.. ఆ పేలవమైన సీజీ వర్క్ ఇంకాస్త చిరాకు పుట్టించింది. “హరిహర వీరమల్లు” ఈ యావరేజ్ టాక్ తో హిట్ స్టేటస్ సంపాదిస్తే మాత్రం అది కేవలం పవన్ కళ్యాణ్ స్టామినా అనే చెప్పాలి. కానీ.. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం విడుదలవ్వకపోతే బాగుండు అనుకున్న ఈ సినిమా ఈ స్థాయి ఓపెనింగ్స్ సంపాదించడం, క్రేజ్ తెచ్చుకోవడం అనేది మాత్రం ఎప్పటికీ ఒక పాఠ్యాంశంగా నిలిచిపోతుంది.
ఫోకస్ పాయింట్: ఫస్టాఫ్ భళా.. సెకండాఫ్ డొల్ల!
రేటింగ్: 2.5/5