Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రజనీకాంత్ (Hero)
  • శృతిహాసన్ (Heroine)
  • నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శౌబిన్ షాహిర్, సత్యరాజ్, రచిత రామ్ (Cast)
  • లోకేష్ కనగరాజ్ (Director)
  • కళానిధి మారన్ (Producer)
  • అనిరుధ్ రవిచంద్రన్ (Music)
  • గిరీష్ గంగాధరన్ (Cinematography)
  • ఫిలోమిన్ రాజ్ (Editor)
  • Release Date : ఆగస్ట్ 14, 2025
  • సన్ పిక్చర్స్ (Banner)

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శౌభిన్ వంటి ఆర్టిస్టులు కలిసి నటించిన చిత్రం “కూలి” అనౌన్స్ మెంట్ టైమ్ నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అనిరుధ్ తనదైన శైలి సంగీతంతో మరింత పెంచేశాడు. మరి ఆ అంచనాలను “కూలీ” అందుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

Coolie Movie Review

కథ: దేవా (రజనీకాంత్) తన మనుషులతో కలిసి చెన్నైలో “దేవా మాన్షన్” అనే అతిథి గృహాన్ని ఏర్పాటు చేసుకొని సంతోషంగా గడిపేస్తుంటాడు. తన స్నేహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) మరణించాదని తెలుసుకొని అతడ్ని చివరిచూపు చూడడం కోసం వైజాగ్ వస్తాడు. అక్కడ రాజశేఖర్ కూతుళ్లు నిస్సహాయ స్థితిలో ఉండడం చూసి చలించిపోయి వాళ్ళకి అండగా అక్కడి ఉండిపోతాడు.

అసలు రాజశేఖర్ ఎలా చనిపోయాడా అని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన దేవాకి వైజాగ్ మాఫియా డాన్ సైమన్ (నాగార్జున) & గ్యాంగ్ అడ్డుగా నిలబడతారు.

అసలు సైమన్ ఎవరు? అతడు చేస్తున్న బిజినెస్ ఏమిటి? దాంతో రాజశేఖర్ కి సంబంధం ఏమిటి? రాజశేఖర్ ను చంపింది ఎవరు? సైమన్ డెయిటెల్స్ తెలుసుకున్న దేవాకి షాక్ ఇచ్చిన అంశం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “కూలి” చిత్రం.

నటీనటుల పనితీరు: రజనీకాంత్ స్క్రీన్ ప్రెజన్స్ తో ఎప్పట్లానే అలరించగా.. ఆయన నుండి కోరుకునే మాస్ ఎలివేషన్స్ మిస్ అవ్వడం కాస్త నిరాశ కలిగించే విషయం. అయితే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రజనీ లుక్ మాత్రం అదిరింది. దాన్ని అనవసరంగా సినిమా రిలీజ్ కి ముందే రివీల్ చేసి తప్పు చేశారు మేకర్స్.

నాగార్జున విలనిజం పండించడంలో సక్సెస్ అయ్యాడు కానీ.. ఆ విలనిజం సినిమాకి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అందువల్ల.. నాగార్జున పాత్ర పెద్దగా ఎగ్జైట్ చేయడు. విలన్ ఎప్పుడైనా హీరోకంటే బలవంతుడిగా ఉన్నప్పుడే మజా ఉంటుంది. ఈ బేసిక్ రూల్ నీ లోకేష్ ఎందుకు “కూలి” విషయంలో ఫాలో అవ్వలేకపోయాడో అర్థం కాదు.

ఇక ఉపేంద్రను చాలా చాలా తక్కువ సీన్లకు పరిమితం చేయడానికి కారణమేంటో అర్థం కాదు. కనిపించిన కొన్ని సీన్స్ లో మాత్రం ఉప్పి మార్క్ షాట్స్ అలరించాయి.

వీళ్లందరికంటే మలయాళ నటుడు శౌబిన్ ఎక్కువగా అలరించాడని చెప్పాలి. అతడి పాత్రలో ఉన్న వేరియేషన్స్, అతడి యాక్షన్ సీన్స్ & విలనిజం పతాక స్థాయిలో ఉన్నాయి.

శృతిహాసన్ పాత్ర సపోర్టింగ్ రోల్ కి పరిమితం కాగా.. కన్నడ నటి రచిత రామ్ మాత్రం ఆశ్చర్యపరిచింది. ఆమె పాత్రకి ఉన్న ట్విస్టులు, ఆమె నటన రెండూ అలరించాయి. అయితే.. శౌబిన్ పాత్రతో ఆమె క్యారెక్టర్ ను లింక్ చేయడం అనేది మైనస్ అయ్యిందని చెప్పాలి.

ఇక అమీర్ ఖాన్ స్క్రీన్ ప్రెజన్స్ కానీ, అతడి పాత్ర కానీ పెద్దగా అలరించలేకపోయాయి. చెప్పాలంటే ఆ ఎపిసోడ్ మొత్తం అనవసరమైన సాగతీతలా ఉంటుంది.

సాంకేతికవర్గం పనితీరు: అనిరుధ్ బీజీయం, పాటలు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. తన 200% ఇచ్చాడు అనిరుధ్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డి.ఐ, కలరింగ్, మిక్సింగ్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ పీక్ లెవల్లో ఉన్నాయి. ప్రొడక్షన్ హౌజ్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అనిపించింది. అయితే.. మాన్షన్ లో వచ్చే ఫైట్ సీన్ లో రజనీకాంత్ ఫేస్ ను మాస్కింగ్ చేసిన గ్రాఫిక్స్ మాత్రం చాలా పేలవంగా ఉన్నాయి. లోకేష్ మిగిల్చిన 5 కోట్లలో కొంచం ఆ సీన్ ఓ గ్రాఫిక్స్ కోసం వాడి ఉంటే బాగుండు అనిపించింది.

ఈ సినిమాకి మెయిన్ మైనస్ కథ. లోకేష్ రాసుకున్న కథలో ఎక్కడా కనీస స్థాయి ఆసక్తి కలిగించే అంశం లేదు. శవాలు మాయం చేయడానికి అంత టెక్నాలజీతో పనేం ఉంది. మొన్నామధ్య కొన్ని సినిమాల్లో చూపించినట్లు “యాసిడ్”లో పడేస్తే అయిపోయేది కదా అనిపించకమానదు. అలాగే.. ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకుని వాళ్లని ఎలివేట్ చేసే స్థాయిలో కథనం కూడా లేకుండాపోయింది. ఏ పాత్ర ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనే ఎస్టాబ్లిష్మెంట్ లేకపోవడంతో వాటికి ఇచ్చే ఎండింగ్స్ అన్నీ చాలా పేలవంగా ఉంటాయి. ఇక సెకండాఫ్ ని నడిపించిన విధానం చాలామందికి బోర్ కొడుతుంది. అసలు ప్రీక్లైమాక్స్ సీక్వెన్స్ లో నాగార్జున ముందు కూర్చుని రజనీకాంత్ చెప్పే కథ ఎంత నీరసంగా ఉంటుందంటే.. అవసరమా అనిపిస్తుంది. ఇక అమీర్ ఖాన్ క్యారెక్టర్ తో ఇచ్చే “అన్న” ఎలివేషన్ కి జనాలు చప్పట్లు కొట్టడం అటుంచితే తిట్టుకుంటారు. రైటింగ్ పరంగా లోకేష్ వీక్ వర్క్ అని చెప్పొచ్చు. అయితే.. అంత వీక్ వర్క్ లో కూడా ఆకట్టుకున్న అంశం రజనీకాంత్-శృతిహాసన్ పాత్రలకు ఇచ్చిన క్లోజర్. ఆ ఒక్క విషయం మాత్రం అలరిస్తుంది. ఓవరాల్ గా.. లోకేష్ మరోసారి స్టార్ వెహికిల్ ని హ్యాండిల్ చేయడంలో తడబడ్డాడు.

విశ్లేషణ: సినిమాలకి జనాలు కేవలం నాలుగు యాక్షన్ సీన్లు, కొన్ని ఎలివేషన్ సీన్లు కోసం వచ్చే రోజులు పోయాయి. ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్ తోపాటుగా మంచి కథనం చాలా కీలకం. ఈ విషయాన్ని మేకర్స్ ఎప్పడు గుర్తిస్తారో. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతిహాసన్, శౌభిన్, రచిత రామ్, సత్యరాజ్ వంటి మహామహులు అందరూ ఉన్నా ”కూలి” చిత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోవడానికి కారణం పేలవమైన రైటింగ్. లోకేష్ కనీసం తన తదుపరి సినిమా విషయంలో అయినా మంచి కథ-కథనంతో ఆకట్టుకోవాలని కోరుకుందాం. ఇకపోతే.. ఈ కంగాళీ “కూలి”ని సదరు హీరోల వీరాభిమానులు మినహా సగటు ప్రేక్షకులు ఆస్వాదించడం కాస్త కష్టమే.

ఫోకస్ పాయింట్: కనగరాజ పులగం!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus