సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా ఆడియన్స్ మొదట చూసేది రేటింగ్స్, రివ్యూలు. కానీ కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన ‘ది డెవిల్’ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. సినిమా చూసిన వాళ్లు తమ అభిప్రాయం చెప్పడానికి లేదు, రేటింగ్ ఇవ్వడానికి అసలే లేదు. నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో మేకర్స్ ఏకంగా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని మరీ రివ్యూలను ఆపించేశారు. బుక్ మై షో లాంటి ప్లాట్ ఫామ్స్ లో కూడా రేటింగ్ ఆప్షన్ తీసేశారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. హీరో బయట లేకపోయినా, ప్రమోషన్స్ చేయకపోయినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదని ఈ సినిమా ఓపెనింగ్స్ నిరూపించాయి. గురువారం విడుదలైన ఈ చిత్రానికి టికెట్ రేట్లు భారీగా ఉన్నప్పటికీ, థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఫ్యాన్స్ తమ హీరోను స్క్రీన్ మీద చూసుకోవడానికి ఎగబడ్డారు.
అయితే రేటింగ్స్ లేకపోవడంతో సినిమా అసలు ఫలితం ఏంటనేది బయట జనాలకు వెంటనే తెలియడం లేదు. కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న మౌత్ టాక్ మాత్రమే ఇప్పుడు ఆధారం. దాని ప్రకారం సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. దర్శన్ డ్యూయల్ రోల్ లో ఇరగదీశారని ఫ్యాన్స్ అంటుంటే, కంటెంట్ ఆశించిన స్థాయిలో లేదని మరికొందరు పెదవి విరుస్తున్నారు.
నిజానికి ఇది దర్శన్ కు చాలా క్లిష్టమైన సమయం. ఒకపక్క కోర్టు కేసులు, మరోపక్క జైలు జీవితం గడుపుతున్న వేళ ఈ సినిమా వచ్చింది. కేవలం ఫ్యాన్ బేస్ ను నమ్ముకునే సినిమాను వదిలారు. అందుకే ఆరంభంలోనే నెగటివ్ టాక్ వస్తే సినిమా దెబ్బతింటుందనే భయంతోనే ఈ ‘నో రివ్యూ’ అస్త్రాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది. హీరో లేకుండా రిలీజ్ అయిన ‘ది డెవిల్’.. రివ్యూలు లేకుండానే బాక్సాఫీస్ దగ్గర నెట్టుకురావాల్సిన పరిస్థితి. ఈ కొత్త స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో, జైల్లో ఉన్న దర్శన్ కు ఈ సినిమా ఎలాంటి ఉపశమనాన్ని ఇస్తుందో చూడాలి.