బాలీవుడ్‌లో ఇప్పటికే చాలామంది చేశారు.. తెలుగులో ఓ స్టార్ హీరో వెబ్ సిరీస్ చేయడం సాధ్యమేనా? ఈ చర్చ జరుగుతున్న సమయంలో ‘దూత’ అంటూ ఓ వెబ్ సిరీస్‌ని అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు నాగచైతన్య. అక్కినేని ఫ్యామిలీ హిట్ డైరక్టర్ అని పేరున్న విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ విజయం సాధించి, టాలీవుడ్ స్టార్ హీరోలూ వెబ్ సిరీస్‌లు చేస్తారు అని నిరూపించింది. అయితే ఆ తర్వాత ఇంకా ఎవరూ చేయలేదు అనుకోండి. ఇప్పుడు ‘దూత’ సిరీస్‌కు సీక్వెల్ రెడీ అవుతోందట.
గత కొన్ని నెలలుగా విక్రమ్ కె.కుమార్ కొత్త ప్రాజెక్ట్ మీద చాలా రకాల వార్తలు వస్తూ వచ్చాయి. అయితే ఆయన నుండి ఇప్పటివరకు ఏ అధికార ప్రకటనా వెలువడలేదు. దీంతో సినిమా విషయం పక్కనపెట్టి ‘దూత’ వెబ్ సిరీస్ రెండో సీజన్ పని చూద్దాం అని విక్రమ్ కుమార్ అనుకుంటున్నారట. తొలి కథకు కొనసాగింపా లేక అదే ప్యాటర్న్‌లో కొత్త సిరీస్‌కి కథ రాసుకుంటారా అనేది తెలియదు కానీ గత కొన్ని నెలలుగా అన్నపూర్ణ స్టూడియోలో దీని మీద విక్రమ్ కుమార్ టీమ్ వర్క్ చేస్తోందట..
ఈ క్రమంలో ఈ రెండో సీజన్ నిర్మాతలు మారుతున్నారు అని తెలుస్తోంది. తొలి సీజన్‌కు శరత్ మరార్ ప్రధాన నిర్మాత. దర్శకుడు విక్రమ్ కె కుమార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ఇప్పుడు సీజన్ 2కి అన్నపూర్ణ స్టూడియోసే నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుంది అని చెబుతున్నారు. అయితే ఎవరు సిరీస్‌ని ప్రొడ్యూస్ చేసినా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమ్ అవుతుంది. ఎందుకంటే ఈ డీల్ ఇప్పటికే అయిపోయింది అని సమాచారం.
నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే… కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘బెదురులంక 2012’ సినిమా దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇది నాగచైతన్య కెరీర్‌లో 25వ సినిమా కావడం గమనార్హం.