సీరియల్స్‌లో బ్లాక్‌బస్టర్‌లు అంటూ ఓ లిస్ట్ రాస్తే.. తొలి స్థానాల్లో నిలిచే సీరియల్ ‘నాగిన్’. 11 ఏళ్ల క్రితం వచ్చిన తొలి సీజన్‌కు వచ్చిన విజయం చూసి.. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏడో సీజన్ మొదలైంది కూడా. సీజన్లు మారుతున్నాయి కానీ.. సీరియల్‌కి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. నాగిని పాత్ర వేసిన నటి ఎవరైనా సరే ఇన్‌స్టంట్ స్టార్ అయిపోతూ వచ్చింది. హిందీలో అత్యంత భారీ విజయం అందుకున్న ఆ సీరియల్ ఇప్పుడు సినిమాగా మారబోతోందని సమాచారం.
‘నాగిన్’ సీరియల్ ఎప్పుడు టెలీకాస్ట్ చేసినా టీఆర్పీలో అగ్రస్థానంలో ఉంటూ వస్తోంది. మరిప్పుడు ఏడు సీజన్ల కథ కలిపి ఒకే సినిమాగా చేస్తారా? లేక ఈ నేపథ్యంలో కథను సిద్ధం చేసుకొని దాన్ని సినిమాగా తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సీరియల్‌ను నిర్మిస్తున్న బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ ఇప్పుడు ఈ సినిమాను కూడా రూపొందిస్తారని భోగట్టా. సినిమాటిక్ టచ్ ఇచ్చేలా ప్రస్తుతం కాన్సెప్ట్‌ను మార్పులు చేస్తున్నారట. ఫైనల్ అయితే సినిమాను పట్టాలెక్కిస్తారట.
ఈ లెక్కన ‘నాగిన్’ సినిమా ప్రారంభ దశలోనే ఉంది. ఇప్పటివరకు టీవీ సీరియల్‌లో నాగినిగా మౌనీ రాయ్, నియా శర్మ, సుర్భి చాందనా, అనిత, తేజస్వి ప్రకాష్, ప్రియాంక చౌదరి చాహర్‌గా కనిపించారు. వీరందరికీ నాగిని పాత్ర మంచి పేరే తీసుకొచ్చింది. మరిప్పుడు సినిమాల్లోకి వచ్చేసరికి ఎవరు నాగిని అవుతారు అనేది చూడాలి. ఒకవేళ సినిమా స్టార్ట్ అయితే నాగిని ఎవరనేది ఆసక్తికరంగా మారుతుందని ఈజీగా చెప్పేయొచ్చు.
అయితే, గతంలో ఇలా టీవీ సీరియళ్ల కాన్సెప్ట్‌లు సినిమాలుగా మారాయి. అయితే వాటికి ఆశించిన విజయం అయితే రాలేదు. మరిప్పుడు ‘నాగిన్’ సీరియల్‌కి ఏమవుతుంది అనేది చూడాలి.