భారతీయ సినిమా రంగంలో భారీ అంచనాలతో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన ముందస్తు బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియర్ షోల కోసం ప్రేక్షకులు చూపుతున్న ఆసక్తి చూస్తుంటే, ఈ చిత్రం రిలీజ్‌కు ముందే భారీ రికార్డులు నమోదు చేయబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, భారతదేశ వ్యాప్తంగా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ.26 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ముందస్తు అమ్మకాల జోరు కొనసాగితే, ప్రీమియర్ షోల ద్వారానే రూ.30 కోట్ల మార్క్‌ను దాటే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో భారీ స్థాయిలో బుకింగ్స్ నమోదయ్యాయి. అలాగే ఢిల్లీలో కూడా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ ఇవ్వబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో బాలీవుడ్ సినిమాలకు ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమైంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించగా, సినిమాలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అలాగే ప్రముఖ నటులు సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
గతంలో విడుదలైన మొదటి భాగం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడంతో, ఇప్పుడు ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రీమియర్ షోలకే ఇంత భారీ రెస్పాన్స్ వస్తుండటంతో, రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 19, 2026న ఈ చిత్రం విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ‘ధురంధర్ 2’ మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.