ఆయనకు లైఫ్ వస్తుందా???

మన టాలీవుడ్ చరిత్రలో 80-90వ శకం తీసుకుంటే హాస్యరస దర్శకుడు జంధ్యాల గారు గుర్తొస్తారు. ఆయన నవ్వించిన తీరు, హాస్యాన్ని తెరపై ఆవిష్కరించిన జోరు అమోఘం, అద్భుతం అనే చెప్పాలి. అయితే ఆయన చేసిన ఆ సినిమాల పుణ్యమా అని దాదాపుగా ఇద్దరు స్టార్స్ కామెడీ హీరోలుగా మారిపోయారు. అందులో ఒకరు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, మరొకరు మన నరేష్. అయితే ఇప్పుడున్న సీనియర్ హీరోల రాకతో వాళ్ళ అవకాశాలు కోల్పోయిన ఈ ఇద్దరూ ఆ తరువాత క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారు.

ఇదిలా ఉంటే వరుసగా పాత్రలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలసి రాని పరిస్థితుల్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ కి, మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లైఫ్ ఇచ్చాడు. ‘జులాయి’లో మంచి పాత్ర ఇచ్చి కెరీర్‌ను మలుపు తిప్పారు. అందులో తనదైన శైలిలో వినోదం పండించిన రాజేంద్ర ప్రసాద్.. మంచి బ్రేక్ అందుకున్నారు. తర్వాత మంచి మంచి పాత్రలు పడ్డాయి. శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలతో మళ్లీ మంచి స్థాయిని అందుకున్నారు. ఇదిలా ఉంటే మరో హీరో నరేష్ కూడా వరుసగా సినిమాల్లో అయితే నటిస్తున్నాడు కానీ, సరైన పాత్రలు మాత్రం పడటంలేదు. అందుకే ఆయన సైతం త్రివిక్రమ్ నుంచి బ్రేక్ ఆశిస్తున్నాడు. విషయం ఏమిటంటే…నితిన్-సమంత నటిస్తున్న ‘అ..ఆ’ సినిమాను మాటల మాంత్రికుడు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నరేష్‌కు కీలకమైన పాత్రే ఇచ్చాడు త్రివిక్రమ్. ఇక ఈ పాత్ర గురించి ఆడియోలో మాట్లాడుతూ…తన పాత్ర కూడా చాలా బాగుంటుందని చెప్పాడు. మరి ఈ పాత్ర రాజేంద్ర ప్రసాద్ కు జులాయి లో పేరు తెచ్చినట్లు మన నరేష్ కు కూడా తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus