సంపత్ నంది తక్కువ టైమ్‌లోనే స్టార్‌డమ్ సంపాదించుకున్న దర్శకుడు. ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అతను, రెండో సినిమానే ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. అలా చేసిన ‘రచ్చ’ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. మాస్ ఆడియన్స్‌కి ఆ సినిమా బాగా నచ్చింది. తర్వాత రవితేజతో చేసిన ‘బెంగాల్ టైగర్’ కూడా హిట్ అయి, సంపత్ నందిని టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేర్చింది.
తర్వాత తీసిన ‘గౌతమ్ నంద’ అంతగా ఆడలేదు కానీ ‘సీటీమార్’ పర్వాలేదనిపించింది. అయితే లేటెస్ట్ ఔటింగ్ ‘భోగి'(Bhogi) సినిమా సంపత్ నందిని అమాంతం కింద పడేసిందనే చెప్పాలి. క్లాస్ ఇమేజ్ ఉన్న శర్వానంద్‌ను హీరోగా పెట్టి దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన సినిమా ఇది. ఈరోజు (నవంబర్ 27న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి నవంబర్ 12నే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కానీ సెన్సార్ ఇబ్బందులు ఎదురవడంతో ఆలస్యమైంది.
సినిమాలో హింస శ్రుతి మించడంతో రివైజింగ్ కమిటీకి వెళ్లాల్సి వచ్చింది. మొత్తానికి రెండు వారాలు ఆలస్యం అయ్యి కొంచెం టైమ్ దొరికినా, చిత్ర బృందం ఈ సినిమాను ఇంట్రెస్టింగ్‌గా ప్రమోట్ చేసింది లేదు. ఏదైతేనేం.. సంపత్ నంది అనే బ్రాండ్ ఈ సినిమాకు కొండంత బలం. పబ్లిసిటీ లేకపోయినా కంటెంట్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద పుంజుకుని అద్భుతాలు చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇది కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందేమో అని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే.. ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథాబలం లేని సినిమా ఇది. ఐదుగురు చెల్లెళ్లను పెట్టి ఫోర్స్డ్ ఎమోషన్ జోడించారు కానీ, అది జనాలు యాక్సెప్ట్ చేసేలా లేదు. బలమైన కథ, ఎమోషన్ లేనప్పుడు ఎన్ని యాక్షన్ సీక్వెన్సులు పెట్టినా ఏం ఉపయోగం? ‘భోగి’ గ్రాఫ్ సీన్ సీన్‌కు పడిపోవడానికి కారణం అదే. ‘ఈ సినిమాను సంపత్ నంది డైరెక్ట్ చేశాడు అని కాకుండా ఓ డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించాడు అని చూడండి’ అంటూ ప్రమోషన్స్‌లో సంపత్ నంది చెప్పాడు.
అతను అలా ఎందుకు చెప్పాడు? అనే ప్రశ్నకు ‘భోగి’ సినిమా ఫస్ట్ సీన్ నుంచే ఆన్సర్ చెబుతుంది. సంపత్ నందికి ఉన్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే నిర్మాత అంత బడ్జెట్ పెట్టి ‘భోగి’ తీయడానికి ముందుకొచ్చాడు. ప్రేక్షకులు కూడా సంపత్ నంది అనే బ్రాండ్‌ను చూసే టికెట్ కొంటారు. ఈ విషయాలు తెలిసి కూడా సంపత్ నంది ‘భోగి’ ప్రమోషన్లలో అలా అన్నాడంటే.. సినిమా రిజల్ట్‌పై ముందే హింట్ ఇచ్చాడని అనుకోవాలేమో!