మన టాలీవుడ్ డైరెక్టర్స్ అందర్లో భీమనేని శ్రీనివాస్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఒక దర్శకుడిగా ఆయన తీసినన్ని రీమేక్ సినిమాలు ఎవరూ తీయలేదు. ఆయన మొదటి సినిమా “శుభమస్తు” మొదలుకొని మొన్న వచ్చిన “సిల్లీ ఫెలోస్” వరకూ అన్నీ రీమేక్సే. మధ్యలో వచ్చిన “నీతోడు కావాలి” ఒక్కటే ఆయన తీసిన స్ట్రయిట్ సినిమా. అది తప్ప మిగతావన్నీ రీమేక్సే. మళ్ళీ ఇప్పుడు మరో రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు భీమనేని.
తమిళంలో ఐశ్వర్య రాజేష్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన “కణా” చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేద్దామనుకున్నారు. ఉమెన్ క్రికెట్ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు మరియు విశ్లేషకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తెలుగులో ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తున్న ఐశ్వర్య రాజేష్ విజయ్ దేవరకొండ హీరోగా తనతో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్న కె.ఎస్.రామారావుకి “కణా” ట్రైలర్ చూపించిందట ఐశ్వర్య రాజేష్. కంటెంట్ తోపాటు సబ్జెక్ట్ నచ్చిన రామారావు వెంటనే సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడమే కాక ఇవాళ అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు. “కౌసల్య కృష్ణమూర్తి” అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు జరిగింది. తమిళంలో సత్యరాజ్ ప్లే చేసిన ఫాదర్ రోల్ ను తెలుగులో రాజేంద్రప్రసాద్ ప్లే చేయనున్నారు. మరి ఈ రీమేక్ కి భీమనేని కరెక్ట్ అని ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ.. ప్రొజెక్ట్ ను ఆయన చేతిలో పెట్టేశారు. మరి తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో భీమనేని ఏ విధంగా మలుస్తాడో చూడాలి.