మనం గతంలో అనుకున్నట్లుగా ఓ సినిమాకి వచ్చిన హైప్‌ను చంపేయడం ఎలా అనేది తెలియాలంటే కొన్ని సినిమాల టీజర్లు చూడాలి.. అందులో ‘విశ్వంభర’ సినిమా మరీ మరీ చూడాలి అని. ఆ సినిమా నేపథ్యం, కాస్టింగ్ చూసి సినిమా మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. అనుకున్నట్లుగానే సినిమా ప్రాథమిక ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. కానీ టీజర్ వచ్చాక దెబ్బకొట్టేసింది. ఎంతలా అంటే సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంకా టీమ్ చెప్పలేనంత. అలాంటి సినిమాకు రెండు పార్టులు అంటే ఎవరూ నమ్మరు. అంతేకాదు వద్దంటారు కూడా.
ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమా విషయంలో ఈ రెండు పార్టుల చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు కావాల్సిన రిపేర్లు చేసిన తర్వాత రెండు పార్టులు అయితే బెటర్ అనే అంచనాలకు చిత్రబృందం వచ్చేసిందని ఆ పుకారు వార్తల సారాంశం. దీంతో మెగా ఫ్యాన్స్‌లో చిన్నపాటి ఆలోచన, క్యూరియాసిటీ మొదలయ్యాయి. తాజాగా ఈ విషయంలో దర్శకుడు మల్లిడి వశిష్ఠ క్లారిటీ ఇచ్చేశారు. కొంతమందికి అది రిలీఫ్ కాగా, మరికొంతమందికి అదొక సమాచారమే.
చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూన్ లేదా జులైలో రిలీజ్ చేస్తారని ఆ మధ్య తనను కలసిన మీడియా ప్రతినిధులతో చిరంజీవి చెప్పారు. అయితే అ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ లేకపోవడంతో రకరకాల రూమర్స్ ప్రారంభమయ్యాయి. ‘విశ్వంభర’ రెండు భాగాలుగా రానుంది అనేది ఆ రూమర్లలో ఒకటి. తాజాగా ఇలాంటి సమాచారం ఉన్న ఓ పోస్ట్‌పై వశిష్ఠ స్పందించారు.
‘అవునా.. నిజమా’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు జోడించారు. దీంతో ఈ వార్తలను ఖండించినట్లైంది. అలాగే ఒకే భాగంలో రానుందని స్పష్టం చేసినట్లు అయింది. అయినా సినిమా పడుతున్న పురిటి నొప్పులు చూశాక కూడా చిరంజీవి రెండు పార్టులకు ఓకే చెబుతారా అంటే కష్టమే అని చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో (అప్పట్లో అలా చెప్పారు) విడుదల కానున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష, ఆషికా నటిస్తున్న విషయం తెలిసిందే.