Double Ismart Review in Telugu: డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రామ్ పోతినేని (Hero)
  • కావ్య థాపర్ (Heroine)
  • సంజయ్ దత్ , సాయాజీ షిండే, బని జె, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్‌పాండే, ఝాన్సీ, ఉత్తేజ్ (Cast)
  • పూరి జగన్నాధ్ (Director)
  • ఛార్మీ కౌర్, పూరి జగన్నాధ్ (Producer)
  • మణి శర్మ (Music)
  • శ్యామ్ కె.నాయుడు (Cinematography)
  • Release Date : ఆగస్టు 15 , 2024

“లైగర్” (Liger) లాంటి డిజాస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్ కి (Puri Jagannadh) , “స్కంద” (Skanda) లాంటి ఫ్లాప్ తర్వాత రామ్ పోతినేనికి  (Ram)  యాసిడ్ టెస్ట్ లాంటి సినిమా “డబుల్ ఇస్మార్ట్”. పూరీ & రామ్ కాంబినేషన్ లో వచ్చి “ఇస్మార్ట్ శంకర్”కు (iSmart Shankar) సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా మణిశర్మ (Mani Sharma)  బాణీలు, కావ్య థాపర్ (Kavya Thapar)  గ్లామ్ షో జనాల్లోకి భీభత్సంగా వెళ్లిపోయింది. సో, శంకర్ క్యారెక్టర్ ఆల్రెడీ మాస్ ఆడియన్స్ లో బాగా రిజిస్టర్డ్ కాబట్టి, సినిమా ఏమాత్రం బాగున్నా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం. మరి సినిమా ఆ స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!

Double Ismart Review

కథ: బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మూడు నెలల్లో చనిపోతానని తెలుసుకున్న బిగ్ బుల్ (సంజయ్ దత్) (Sanjay Dutt)  బ్రెయిన్ ట్రాన్స్ఫర్ ద్వారా కలకాలం బ్రతికి ఉండాలని చేసే ప్రయత్నంలో.. ఆల్రెడీ హైద్రాబాద్ లో బ్రెయిన్ లో యు.ఎస్.బి పోర్ట్ పెట్టుకొని బ్రతుకుతున్న ఇస్మార్ట్ శంకర్ (రామ్) గురించి తెలుసుకొంటాడు. తన బ్రెయిన్ ను శంకర్ బుర్రలోకి ట్రాన్స్ఫర్ చేసి తన భవిష్యత్ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో శంకర్ & బిగ్ బుల్ నడుమ జరిగిన హోరాహోరీ యుద్ధమే “డబుల్ ఇస్మార్ట్”.

నటీనటుల పనితీరు: “ఇస్మార్ట్ శంకర్” అలియాస్ డబుల్ ఇస్మార్ట్ గా రామ్ పోతినేని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. బాడీ లాంగ్వేజ్ మొదలుకొని యాస వరకు ప్రతి విషయంలో ఓల్డ్ సిటీ ప్రతిధ్వనిస్తుంది. ఇక డ్యాన్స్ & ఫైట్స్ తో అయితే మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు. రామ్ లోని ఎనర్జీ వెండితెరపై పొంగిపొర్లి ఆడియన్స్ మీదకు ఎగబాకిందనే చెప్పాలి. కావ్య థాపర్ గ్లామర్ డోస్ బాగా యాడ్ చేసింది. డ్యాన్సుల విషయంలోనూ రామ్ ఈజ్ ను మ్యాచ్ చేసింది. ఇన్నాళ్ల కెరీర్లో ఆమెకు బహుశా ఇదే మంచి హిట్ అని చెప్పాలి.

సంజయ్ దత్ కి ఇది రెండో తెలుగు సినిమా, ఇదివరకు “చంద్రలేఖ” అనే సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన సంజు బాబా.. ఈ సినిమాలో బిగ్ బుల్ గా స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు. ఒంటరి తల్లి పాత్రలో నిడివి చిన్నదే అయినా నటి ఝాన్సీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. గెటప్ శ్రీను (Getup Srinu) , బాని, టెంపర్ వంశీ (Temper Vamsi) , సయాజీ షిండే (Sayaji Shinde) తదితరులు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: మణిశర్మ ఈ సినిమాకి సెకండ్ హీరో. డబుల్ ఇంపాక్ట్ మ్యూజిక్ తో అలరించాడు. ప్రతి ఒక్క పాట ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసింది. ముఖ్యంగా మార్ ముంత చోడ్ చింతా పాటకు థియేటర్ టాపు లేచిపోద్ది. అలాగే.. నేపథ్య సంగీతం కూడా బాగుంది. శ్యామ్ కె.నాయుడు (Shyam K Naidu) సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. అయితే.. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో మాత్రం పూరీ కెరీర్లోనే చీపెస్ట్ అని చెప్పొచ్చు. దాదాపుగా 25 కోట్ల రూపాయలు క్యాస్టింగ్ మీద ఖర్చు చేసిన పూరీ ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ ను గాలికొదిలేశాడు. కాకపోతే.. తనదైన శైలి డైలాగులతో మాత్రం ఎప్పట్లానే మ్యాజిక్ చేశాడు. సింపుల్ కాన్సెప్ట్ ను మరీ ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా.. మదర్ సెంటిమెంట్ ను సరిగ్గా వాడుకోని పక్కా కమర్షియల్ సినిమాను అందించాడు పూరీ.

అయితే.. అలీతో (Ali) ఆ జుమాంజీ కామెడీ ట్రాక్ ఎందుకు ఇరికించాడు అనేది ఆయనకే తెలియాలి. సదరు ఎపిసోడ్స్ కానీ అలీ సెన్సార్ కు దొరక్కుండా మాట్లాడే బూతులు కానీ అత్యంత హేయంగా ఉన్నాయి. అలీ తెరపై చేసే కొన్ని చేష్టలు చూస్తే ఇది నిజంగానే పూరీ జగన్నాథ్ తీసాడా అనిపిస్తుంది. ఆ నికృష్టమైన అలీ ఎపిసోడ్ ను తీసేస్తే.. “డబుల్ ఇస్మార్ట్” మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ: ఒక పక్కా కమర్షియల్ సినిమా వచ్చి చాలా గ్యాప్ వచ్చింది. రామ్ ఎనర్జీ, కావ్య థాపర్ అందాలు, మణిశర్మ బాణీలు కలగలిసి “డబుల్ ఇస్మార్ట్”తో ఆ గ్యాప్ ను ఫిల్ చేసాయనే చెప్పాలి. ప్రోపర్ పూరీ రేంజ్ సినిమా కాకపోయినా.. ఆయన మునుపటి సినిమాతో పోల్చి చూస్తే చాలా బెటర్. సో, మాస్ ఆడియన్స్ & కుర్రాళ్ళకి ఈ “డబుల్ ఇస్మార్ట్” బానే ఎక్కేస్తుంది.

ఫోకస్ పాయింట్: ఇస్మార్ట్ శంకర్ గాడి డబుల్ గేమ్ వర్కవుటయ్యింది!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus