Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు
- March 24, 2026 / 12:31 PM ISTByFilmy Focus Desk
‘దృశ్యం 3’ సినిమా వాయిదాల గురించి మొన్నీ మధ్య వరకు మాట్లాడుకున్నాం. మలయాళ ‘దృశ్యం 3’ సినిమా వచ్చేంతవరకు ఇతర భాషల్లో సినిమాను రిలీజ్ చేయడానికి లేదు అని టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో బాలీవుడ్ ‘దృశ్యం 3’ సినిమా టీమ్ రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకుంది. తెలుగులో అయితే సినిమా షూటింగ్ మొదలు కాలేదు. ఇంత చేసిన మలయాళ ‘దృశ్యం 3’ టీమ్ ఇప్పుడు తమ సినిమాను వాయిదా వేసుకుంది. కొత్త రిలీజ్ డేట్‌ను సినిమా టీమ్ అనౌన్స్ చేసింది.
Drishyam 3
మోహన్‌లాల్ అభిమానులకు ఒక విధంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్ 2న సినిమాను రిలీజ్ చేస్తామని తొలుత టీమ్ ప్రకటించింది. మరో పది రోజులు ఉంది అనగా ఇప్పుడు పోస్ట్ పోన్ చేసింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా ఇంకా ప్రచారం షురూ చేయనప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు అనుకున్నదే జరిగింది. ఈ మేరకు మోహన్ లాల్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు. వేచి చూస్తూ ఉంటుంది. జార్జ్ కుట్టి మే 21, 2026న వస్తున్నాడు’ అని అందులో రాసుకొచ్చారు.
వాయిదాకు కారణాలు చెప్పలేదు కానీ.. పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలోనే సినిమాను వాయిదా వేశారు అని సమాచారం. మలయాళ సినిమాలకు ఆయా దేశాల్లో మంచి ఆదరణ దక్కుతూ ఉంటుంది. ఈ సమయంలో సినిమాను తీసుకొస్తే ఆశించిన ఫలితం రాదు అని టీమ్ అనుకుంది అని చెబుతున్నారు. అందుకే సినిమాను ఏడు వారాలు వాయిదా వేసేశారు అని చెబుతున్నారు. అయితే ఈ వాయిదా వల్ల హిందీ ‘దృశ్యం 3’ పరిస్థితి తేలడం లేదు. ఆ సినిమాను కూడా వాయిదా వేస్తారా లేక తొలుత చెప్పినట్లు అక్టోబరు 2నే విడుదల చేస్తారా అనేది చూడాలి.
ఇక మలయాళ ‘దృశ్యం 3’ పనులు అయిపోయాక జీతూ జోసెఫ్ టాలీవుడ్ వచ్చిన వెంకటేశ్‌తో తెలుగు ‘దృశ్యం 3’ తీయాల్సి ఉంది. మరి ఆయన ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి. మొన్నామధ్య తెలుగు సినిమా ఉండకపోవచ్చు అని కూడా వార్తలొచ్చాయి. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.











