“ఆకతాయి” అనే చిత్రంతో హీరోగా పరిచయమైన ఆశిష్ రాజ్ కథానాయకుడిగా నటించిన రెండో చిత్రం “ఇగో”. గతంలో శ్రీరామ్ చంద్రతో “ప్రేమ గీమా జాంతా నహీ” అనే చిత్రాన్ని తెరకెక్కించిన సుబ్రమణ్యం ఈ చిత్రానికి దర్శకుడు. విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (జనవరి 19) విడుదలైంది. మరి మొదటి చిత్రంతో నిలదొక్కుకోలేకపోయిన ఆశిష్ రాజ్ రెండో చిత్రంతో ఏమేరకు ఆకట్టుకొన్నాడో చూద్దాం..!!
కథ : అందమైన అమలాపురంలో నివసించే ఇందు (సిమ్రాన్), గోపి (ఆశిష్ రాజ్)లకు చిన్నప్పట్నుంచి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఉన్నంతసేపు ఒకర్నొకరు దెప్పిబొడుచుకుంటూనో, తిట్టుకుంటూనో ఉంటారు. ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేసేందుకు విశ్వప్రయత్నం చేస్తూ.. తమ కుటుంబాల పేరు పాడు చేస్తుంటారు. కట్ చేస్తే.. తన కంటే ముందు ఇందుకి పెళ్లి అవుతుందని తెలుసుకొన్న గోపీ.. ఇందు కంటే ముందే మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాలని నిశ్చయించుకొని హైద్రాబాద్ బయలుదేరతాడు, అక్కడ మంచి పోష్ అమ్మాయిల్ని పడేయడం కోసం ప్రయత్నిస్తుంటాడు.
అయితే.. తాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నది ఇందునే అని గ్రహించిన గోపి తన ప్రేమను ఇందుతో పంచుకోవాలని ప్రయత్నించడం, కొన్ని అవాంతరాల తర్వాత ప్రేమ పక్షులు కలవడం జరిగిపోతాయి. మళ్ళీ కట్ చేస్తే.. గోపి ఒక అమ్మాయిని (దీక్షాపంత్)ను చంపిన హంతుకుడు అని పోలీసులు (అజయ్) అరెస్ట్ చేస్తాడు. అసలు దీక్షాపంత్ కి గోపికి సంబంధం ఏమిటి? ఆమె హత్య కేసులో గోపీ ఎలా ఇరుక్కున్నాడు? చివరికి ఈ సమస్యల సుడిగుండడం నుంచి బయటపడి ఇందుతో సరికొత్త జీవితం మొదలెట్టాడా లేదా? వంటి ప్రశ్నలకు అత్యంత అనాసక్తికరంగా చెప్పిన సమాధానాల సమాహారమే “ఇగో” కథాంశం.
నటీనటుల పనితీరు : హీరోగా ఆశిష్ రాజ్ రెండో సినిమాతో ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వలేదు. మంచి బ్యాకింగ్, బోలెడంత టైమ్ ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోకుండా హీరోగా పేరు తెచ్చుకోవాలనే తపన మినహా అభినయం విషయంలో కనీస స్థాయి అవగాహన లేకుండా ఎన్ని సినిమా చేసినా అవన్నీ తుగ్లక్ యుద్ధాల్లా ఉంటాయే తప్ప, ఎలాంటి ఫలితం ఉండదు. హీరోయిన్ సిమ్రాన్ చూడ్డానికి అందంగా ఉన్నప్పటికీ.. అమ్మడికి కూడా నటనలో ఓనమాలు తెలియకపోవడంతో ఆమెను కూడా చూడలేం.
అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. అసలు ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించి తనదైన నటనతో ఆ పాత్ర ఔన్నిత్యాన్ని పెంచే రావురమేష్ చేత తెలంగాణ యాసలో అర్ధం లేని క్యారెక్టరైజేషన్ తో చిరాకుపెట్టించాడు. 30 ఈయర్స్ పృధ్వీ కాస్త నవ్వించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆ జోకులన్నీ సీగ్రేడ్ వి అవ్వడంతో నవ్వు పక్కనపెడితే చిరాకు వస్తుంది. ఇంకా సినిమాలో లెక్కకుమిక్కిలి క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ.. సదరు పాత్రల వల్ల కథలో కన్ఫ్యూజన్ తప్పితే కథనానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
సాంకేతికవర్గం పనితీరు : మనం యూట్యూబ్ లో చూసే షార్ట్ ఫిలిమ్స్ బెటర్ అనిపిస్తుంది సినిమాటోగ్రఫీ చూస్తుంటే.. పల్లెటూరి ఎపిసోడ్స్ మొత్తంలో ఒక్కటంటే ఒక్క స్టాండర్డ్ ఫ్రేమింగ్ లేదు. పైగా.. కెమెరాను ఏదో బుడ్డోడు గిలిగిచ్చకాయ ఊపినట్లు అస్తమానం పైకి కిందకి ఊపడం వల్ల ఉపయోగం ఏమిటనేది సినిమాటోగ్రాఫర్ కే తెలియాలి. సాయికార్తీక్ బాణీలు ఎప్పట్లానే ఎక్కడో విన్నట్లే ఉన్నాయి. ఒక్కపాట కూడా గుర్తుపెట్టుకొనే స్థాయిలో లేదు. ఇక సదరు పాటల పిక్చరైజేష్, టైమింగ్ కి సెన్స్ లేకపోవడం, ముఖ్యంగా సినిమా మొదలైన మొదటి 40 నిమిషాల్లోనే మూడు పాటలు వరుసబెట్టి రావడంతో చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వేల్యుస్ విషయంలో నిర్మాతల మీద జాలిపడకుండా ఉండలేమ్. దర్శకుడు ఏం చెప్పి వాళ్ళని ఒప్పించాడో తెలియదు కానీ.. కుదిరినంతలో ఒక రూపాయి ఎక్కువ పెట్టినట్లే కనిపిస్తుంది తప్పితే ఎక్కడా కక్కుర్తిపడలేదు.
దర్శకుడు సుబ్రమణ్యం కథలోని అనవసరమైన ట్విస్టులు రాసుకోవడంలో పెట్టిన శ్రద్ధ సగంలో సగమైనా కథా గమనంపై పెట్టి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. ఫస్టాఫ్ మొదలుకొని ఆఖరి 20 నిమిషాలు మినహా సినిమా మొత్తం అతుకుల బొంతలా ఉంటుంది. ఆ వెగటు పుట్టే ఆ దరిద్రపుగొట్టు ద్వంద్వార్ధపు సంభాషణలేమిటో, ఎప్పుడో 2005లో ఫార్వాడ్ మెసేజుల్లో వచ్చిన కుళ్ళు జోక్ ను బేస్ చేసుకొని సేమ్ కాన్సెప్ట్ తో ఆరు కామెడీ సీన్స్ ఏమిటో, ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమిటో, ఇక ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్నైతే 80ల కాలం నుంచి తెలుగు సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. సినిమా మొత్తానికి డైరెక్టర్ చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే.. సినిమాలోని ప్రతి పాత్రకి అనవసరమైన “ఈగో” పెట్టి సినిమా టైటిల్ “ఇగో”ను జస్టిఫై చేశాడు.
విశ్లేషణ : కనీస స్థాయి కథ-కథనాలు లేకపోవడమే కాక, “సినిమాకి ఎందుకొచ్చామ్ రా భగవంతుడా?” అని థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడు తనని తాను తిట్టుకొనే స్థాయిలో ఉన్న “ఇగో” చిత్రాన్ని చూడాలనుకోవడం సాహసమే చెప్పాలి.
రేటింగ్ : 0.5/5