ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లోని కుబేరుల్ని సైతం షేక్ చేస్తున్న అంశం ఎప్‌స్టీన్ ఫైల్స్. చాలా ఏళ్లుగా ఈ విషయంలో చర్చ జరుగుతూనే ఉన్న.. ఇటీవల వరుసగా ఇందులోని విషయాలు బయటకు వచ్చాయి. అప్పటివరకు వీటి గురించి బహిరంగంగా మాట్లాడని సెలబ్రిటీలు, సెలబ్రిటీలు భార్యలు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రొచ్చు బాలీవుడ్‌కి తాకింది. హిందీ సినిమాకు చెందిన ఇద్దరి పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వారే దర్శక నటుడు అనురాగ్ కశ్యప్, దీపక్ చోప్రా. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఓ ఈవెంట్ కోసం అనురాగ్ కశ్యప్ 2017లో బీజింగ్ వెళ్లారంటూ పుకార్లు వచ్చాయి. వీటిపై అనురాగ్ కశ్యప్ స్పందించి ఖండించారు. ‘‘వక్తగా నాకు నెలకు చాలా ఆహ్వానాలు వస్తుంటాయి. అరుదుగా వాటిపై స్పందిస్తుంటా. అయితే నా జీవితంలో ఇప్పటివరకూ బీజింగ్ వెళ్లలేదు’’ అని క్లారిటీ ఇచ్చేశారు. ఇక దీపక్ చోప్రా మాట్లాడుతూ నేనెప్పుడూ నేరపూరిత కార్యకలాపాల్లో భాగం కాలేదు. ఎప్‌స్టీన్‌తో నా పరిచయం పరిమితమైనది. వివాదాస్పద లైంగిక నేరాల ఘటనతో నాకు సంబంధం లేదు అని చెప్పేశారు.
అసలేంటీ ఎప్‌స్టీన్ ఫైల్స్..
అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులోని రహస్య పత్రాలను ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ అంటున్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం ఈ పత్రాలను బహిర్గతం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎప్‌స్టీన్ అమెరికన్ బిలియనీర్. మైనర్ బాలికలను లైంగిక అక్రమ రవాణా చేసినట్లు నిర్ధరణ అయింది. 2019లో ఎప్‌స్టీన్ జైలులో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన కోర్టు పత్రాలు, సాక్ష్యాలు, విమాన ప్రయాణ వివరాలు, కాంటాక్ట్ లిస్టులను ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తూ వస్తోంది.
అయితే ఈ పత్రాల్లో ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల పేర్లు ఉండటం కలకలం రేపుతోంది. అయితే, ఒక వ్యక్తి పేరు ఈ ఫైల్స్‌లో ఉన్నంత మాత్రాన అతను నేరం చేసినట్లు కాదు. కొందరు కేవలం ఆయనకు తెలిసిన వారు, లేదంటే ఆయన విమానంలో ప్రయాణించిన వారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఫైల్స్‌ను పూర్తిగా విడుదల చేసేందుకు ఉద్దేశించిన బిల్లుపై ఇటీవల సంతకం చేశారు. దీనివల్ల దాదాపు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 2 వేల వీడియోలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా చర్చ జరుగుతుంది.