కొత్త పాట వచ్చినప్పుడు.. గూగుల్ మైక్ ఆన్ చేసేసి తెగ వెతికేస్తున్నారు. టీజరో, ట్రైలరో వచ్చినప్పడు స్క్రీన్ షాట్లు కొట్టేసి గూగుల్‌ని, ఏఐని అడిగేస్తున్నారు.. ఇలాంటి సీన్ ఎక్కడైనా ఉందా అని వెతికేస్తుంటారు. ఏ చిన్న ఫ్రేమ్ దొరికినా ‘అదే ఇది ఇదే అది’ అనేస్తున్నారు. ఇక సినిమా వచ్చాక ఏదైనా ఓ ఫ్రేమ్ ఇంకో సినిమాలో ఉందనిపించినా.. ఏ సీన్ గతంలో ఉన్నట్లు అనిపించినా ‘ఈ సినిమా కాపీ’ అని మరక వేస్తుంటారు. అలాంటి ఒక ప్లాట్‌కి ప్లాట్ గతంలో వచ్చి ఉంటే ఆ సినిమా ఈ సినిమా ఒకటే అనేస్తున్నారు. ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది.
ఓవైపు మెగా కంబ్యాక్ అంటూ చిరంజీవి అభిమానులు మురిసిపోతుంటే మరోవైపు ఈ సినిమా ఈ సీన్ ఫలానా సినిమాలో ఆ సీన్‌లా ఉంది అంటూ వెతుకులాడి.. ఇదిగో ప్రూఫ్ అని చూపిస్తున్నారు. కొంతమంది అయితే ఆ సినిమా కథ, ఈ సినిమా కథ ఒక్కటే అంటూ ప్లాట్‌లు వివరిస్తున్నారు. దీంతో చిరంజీవి అభిమానులకు చిర్రెత్తుకు వస్తోంది. కొంతమంది మీ సినిమాలు ఏమన్నా స్ట్రెయిట్.. ఏదో సినిమా నుండి ఎత్తేసినవే అని కామెంట్లు చేస్తున్నారు.
పిల్లలు దూరమైన హీరో వాళ్ల కోసం ఆలోచిస్తూ, భార్యకు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తుండటం గతంలో అజిత్ ‘విశ్వాసం’, వెంకటేష్ ‘తులసి’తోపాటు చిరంజీవి సినిమా ‘డాడీ’లోనే చూశాం అని అంటున్నారు. అయితే ఆ సినిమాలో ఫ్యామిలీ చుట్టూ రాసుకున్న సీన్లు చాలా సీరియస్‌గా ఉంటాయి. కానీ ఈ సినిమాలో వాటిని కూల్‌గా, కంట్రోల్డ్‌గా రాసుకొచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి. అదే సినిమాకు ప్లస్‌గా మారింది.
జనవరి 12న విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ రావడంతో మొదటిరోజు వసూళ్లు భారీగానే వచ్చాయి. ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వెల్లడించింది.