హరిత గోగినేని అనే మహిళా దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయమవుతూ తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా “ఫియర్” (Fear) . వేదిక ప్రధాన పాత్ర పోషించిన థ్రిల్లర్ నేడు (డిసెంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ప్రయత్నం ప్రేక్షకులని ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!
కథ: సింధు (వేదిక) పీస్ మెంటల్ ఎసైలంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అయితే.. ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది? అనే విషయం ఆమెకు కూడా తెలియదు. ఎప్పడు సంపత్ (అరవింద్ కృష్ణ) కోసం వెతుక్కుంటూ, ఎదురుచూస్తూ ఉంటుంది. అసలు సంపత్ ఎవరు? సింధు ఎందుకని ఎసైలంలో ఇరుక్కుంది? వంటి ప్రశ్నలకు సమాధానం “ఫియర్” (Fear) చిత్రం.
నటీనటుల పనితీరు: వేదిక నటించడానికి చాలా ప్రయత్నించి కానీ.. ఆమె కళ్ళల్లో భయం కనిపించలేదు, హావభావాల్లో ఎమోషన్స్ అర్థం కాలేదు. చాలా సన్నివేశాల్లో ఆమె ఏం చెప్పాలనుకుంటుందా అనేదానికి సబ్ టైటిల్స్ వేస్తే బాగుండు అనిపించింది. సాహితీ దాసరి అవసరమైన మేరకు నటించి ఫర్వాలేదనిపించుకుంది. షాయాజీ షిండే, అనీష్ కురువిల్లా, పవిత్ర లోకేష్, సత్య కృష్ణన్, షాని సాల్మన్ తదితరులు సినిమాలో ఎందుకు ఉన్నారు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది చివరికి.
సాంకేతికవర్గం పనితీరు: టైటిల్స్ లో ఆండ్రూ పేరు చూసాక ఓపెనింగ్ విజువల్స్ చూసాక ఆశ్చర్యపోతాం. అంత సీనియర్ సినిమాటోగ్రాఫర్ వర్క్ ఇదా అనుకుంటారు ప్రతి ఒక్కరూ. ఎంత కొత్త టింట్ కోసం ప్రయత్నించారు అని టీమ్ చెప్పుకున్నా, ఏదో ఫోన్ లో షూట్ చేసినట్లుగా అనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ గురంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంత సైకలాజికల్ థ్రిల్లర్ అని ఆర్ట్ డిపార్ట్మెంట్ కవర్ చేసినా.. చాలా చోట్ల షార్ట్ ఫిలిం చూస్తున్న భావన కలుగుతుందే కానీ సినిమా చూస్తున్నామన్న భావన ఎక్కడా కలగలేదు.
దర్శకురాలు హరితా గోగినేని నిజానికి చాలా అవసరమైన అంశాన్ని కథగా ఎంచుకున్నారు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్లకి ఎంత సమయం కేటాయించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఇచ్చిన మెసేజ్ బాగున్నా.. ఆ మెసేజ్ ను ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చెప్పడం కూడా ముఖ్యమే అనే విషయాన్ని మరిచారు. అందువల్ల 112 నిమిషాలు ప్రేక్షకులు థియేటర్లలో కూర్చోవడానికి చాలా ఇబ్బందిపడ్డారని చెప్పాలి.
ముఖ్యంగా ఓ థ్రిల్లర్ కు హారర్ ఇంపాక్ట్ తీసుకురావాలి అంటే, కథనం & సీన్ కంపోజిషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవేమీ లేకపోవడం, పైగా ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ & ఎడిటింగ్ బాధ్యతలు కూడా హరిత గోగినేని నిర్వర్తించడం కారణంగా సినిమా తాలూకు రిజల్ట్ క్రెడిట్ మొత్తం ఆమె ఖాతాలోకే వెళ్లింది.
విశ్లేషణ: పాయింట్ గా అనుకున్న కథ పూర్తిస్థాయిలో డెవలప్ చేసినప్పుడు బోలెడు ప్రశ్నలు తలెత్తుతాయి. వాటన్నిటికీ సరైన సమాధానాలు రాసుకున్న తర్వాతే సినిమా మొదలుపెట్టాలి. అలా చేయని యెడల “ఫియర్” వస్తుంది. పూర్ ప్రొడక్షన్ డిజైన్, బ్యాడ్ సినిమాటోగ్రఫీ వర్క్, బేసిక్ ఎలిమెంట్స్ లేని డైరెక్షన్ కారణంగా “ఫియర్” ఆడియన్స్ ను ఏమాత్రం అలరించలేకపోయింది.
ఫోకస్ పాయింట్: ఫియర్ కాదు బోర్!
రేటింగ్: 1/5