గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రివ్యూ

  • December 27, 2016 / 07:36 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో సోమవారం విడుదలయింది. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ చిరంతన్ భట్ అద్భుతమైన పాటలు అందించారు. తన మ్యూజిక్ తో ఒకటవ శతాబ్దం లోకి తీసుకెళ్లారు. ఈ ఆల్బమ్ లోని పాటలు ఎలా ఉన్నాయంటే..

01 – ఎకిమీడా
ఒక వినసొంపైన రొమాంటిక్ పాటతో ఈ ఆల్బమ్ ని ప్రారంభించారు. ఉదిత్ నారాయణ, శ్రేయ ఘోషల్ పాడిన ఈ సాంగ్ మన జానపద గేయాలను తలపిస్తాయి. ఇందుకు సున్నితమైన, చిపిలి పదాలతో ప్రేమను శృంగారాన్ని మిళితం చేశారు సిరివెన్నెల సీతారామ శాస్ర్తి . “కడవై ఉంటా నడువంపుల్లో.. కోకా రైకా నీవనుకుంటా” అనే పద ప్రయోగాలు మనసును గిలిగింతలు పెడుతాయి.

02 – ఘన ఘన ఘన
యుద్ధం సమయంలో సైనికులను ఉత్తేజపరచడానికి కళాకారులూ పాడే పాట “ఘన ఘన ఘన”. సిరివెన్నెల సీతారామ శాస్ర్తి కలం నుంచి వచ్చిన ఈ పాటను సరికొత్తగా చిరంతన్ బట్ కంపోజ్ చేయగా గాయకులు సింహ, ఆనంద్ భాస్కర్ ఎంతో ఆవేశంతో పాడి ఉత్సహాన్ని నింపారు.

03 . మృగనయన భయమేలనే
సాంప్రదాయ వాయిద్యాలతో “మృగనయన భయమేలనే” అనే పాటను చిరంతన్ బట్ స్వరపరచి చెవుల్లో నిండిన తుప్పుని వదలగొట్టారు. ఓవైపు మృదంగం దరువులు హాట్ బీట్ ని పెంచుతుంటే ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం, సుమధుర గాయని శ్రేయ ఘోషల్ లు తమ గాత్రంతో హాయిని పంచారు. ఈ పాటను కూడా సీతారామ శాస్ర్తి రాసి, తన ఆలోచనలు యవ్వనంలో ఉన్నాయని నిరూపించారు.

04 – సాహో సార్వ భామ సాహో
గౌతమీ పుత్ర శాతకర్ణి పోరాట ప్రతిమను, వీర ఖడ్గం విన్యాసాలను అక్షరాలతో నింపితే అదే సాహో సార్వ భామ సాహో పాట. యుద్ధాల సమయంలో వచ్చే ఈ సందర్భానుసార గీతం విజయ గీతంగా నిలవనుంది. సీతారామ శాస్ర్తి గొప్ప పదాలను సమకూర్చి రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్ , కీర్తి అమోఘంగా పాడి సంగీత అభిమానుల మనసుదోచుకున్నారు.

05 – సింగముపై లంఘించెను..
శాతకర్ణి బాల్యం నుంచి ఎదిగిన తీరుని బుర్రకథ రూపంలో “సింగముపై లంఘించెను..” అనే పాటలో వివరించారు. ఈ కథాగానంలో కథను కొంతమేర కళ్లకు కట్టారు. దీనిని సాయి మాధవ్ సాహిత్యాన్ని అందించగా విజయ్ ప్రకాష్ చక్కగా పాడి ఆకట్టుకున్నారు. మన కళా సంస్కృతిని గుర్తు చేసారు.

నాలుగువందలయేళ్లు భారత దేశాన్ని పాలించిన శాతవాహనుల కాలానికి చెందిన కథతో తెరకెకెక్కిన్న ఈ చారిత్రాత్మక చిత్రానికి చిరంతన్ భట్ సరిపోయే మ్యూజిక్ ని ఇచ్చారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీ పాటలకు భిన్నంగా ఈ సాంగ్స్ ని కంపోజ్ చేసి కొత్త ఫీల్ ని అందించారు. సీతారామ శాస్ర్తి కూడా రొటీన్ పదాలు కాకుండా, అందరినోటా నలిగిన సాహిత్యం కాకుండా సరికొత్త వాటిని వెతికి పట్టుకొని మాలగా చేసి మనకిందించారు. వాటిని అర్ధం చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి మరికొంత సమయం పడుతుంది. ఈ పాటలు సినిమా విడుదలయిన తర్వాత మరింతగా హృదయాల్లోకి చొచ్చుకొని పోతాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus