మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా కొందరు కాలంతోపాటు పరిగెడుతుంటారు, కానీ ఈయన మాత్రం కాలానికి ఒక రెండు అడుగులు ముందే ఉంటారు. ఈయన తీసుకునే కొన్ని నిర్ణయాలు ఊహాతీతం, అవి మొదటి ఆశ్చర్యం కలిగిస్తాయి, కొన్ని రోజులు తరువాత అర్ధమవుతాయి, ఇంకొన్ని రోజులు తరువాత అద్భుతం అనిపిస్తాయి. “ఆహా” లో అన్ స్టాపబుల్ లాగా.
ఒక మంచి సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లాలి అని ఆయనకు ఉండే సంకల్పమే నేడు “ఆహా” ఓటిటి ప్లాట్ ఫ్రామ్. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో అందించడం అనేది తెలుగు ప్రేక్షకులకు గొప్ప విషయం. కేవలం ఓటిటిలోనే కాకుండా థియేటర్స్ లో కూడా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు.
సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ద్వారా రిలీజ్ చేసారు. రిలీజ్ అయిన మొదటిరోజునుంచే ఈ చిత్రం ఊపందుకుంది. విడుదలైన అన్ని చోట్ల భారీ రెస్పాన్స్ వచ్చింది. కాంతార చిత్రం విడుదలైన 2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు సాధించి దాదాపుగా ఇప్పుడు 60 కోట్ల వసూళ్లను సాధించింది.ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందనేది ఊహాతీతం.
అదే తరహాలో “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ఇప్పుడు వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న “భేదియా” చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది.తెలుగులో “తోడేలు” పేరుతో ఈ సినిమాను నవంబర్ 25 న భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేస్తుంది. ఇది వరకే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు సాంగ్స్ కు అనూహ్య స్పందన లభిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్ర ప్రొమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే వరుణ్ ధావన్, కృతిసనన్ కూడా నేరుగా హైదరాబాద్ విచ్చేసి ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొననున్నారు. కాంతారతో సూపర్ సక్సెస్ అందుకున్న “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ఇప్పుడు తోడేలు చిత్రంతో కూడా అదే స్థాయి విజయాన్ని సాధించుకుంటుంది అనే పరిణామాలు కనిపిస్తున్నాయి.