Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

మరాఠీ చిత్రం ‘గోంధల్‌’… ప్రతిష్ఠాత్మ ఆస్కార్‌ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మన దేశం తరఫున అధికారికంగా ఎంపికైన సినిమా. మొన్నీ మధ్య వరకు ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. మరాఠీ వర్గాల్లో తప్ప ఇంకెక్కడా ఈ సినిమా గురించి ప్రస్తావన లేదు. చర్చ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆ సినిమా కథేంటో చూద్దాం. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో గోంధల్‌ నేపథ్యంలో జరిగే కథతో దర్శకుడు సంతోష్‌ దావఖర్‌ ‘గోంధల్‌’ సినిమాను తెరకెక్కించారు.

Gondhal

గోంధల్‌ అనేది మరాఠీ గ్రామీణ సంస్కృతితో ముడిపడిన ఓ సంప్రదాయ ప్రదర్శన. శుభకార్యం జరిగే ఇళ్లలో రాత్రి గోంధల్‌ కళాకారులు కాగడాలు పట్టుకొని దేవుడిని ఆహ్వానిస్తూ, పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. మరాఠీలో గోంధల్‌కు మరో అనే అర్థం కూడా ఉంది. అదే గందరగోళం. ఒక ఊరిలో సంబరాలతో సందడిగా ఉన్న వేళ మనుషుల్లోని వ్యామోహం, అసూయ, ప్రేమ, ప్రతీకారం, కుట్రలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయన్నది ఈ సినిమా.

మహారాష్ట్రలోని ఓ గ్రామంలో సంపన్న కుటుంబానికి చెందిన ఆనంద్‌రావ్‌కు, సుమన్‌ అనే యువతితో వివాహం జరుగుతుంది. నూతన వధూవరుల జీవితం బాగుండాలని కోరుకుంటూ పెళ్లింట గోంధల్‌ ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ప్రదర్శన కొనసాగుతున్న సమయంలో మనుషుల్లోని వికృత ముఖాలు బట్టబయలవుతాయి. ఆ సందర్భంగానే సుమన్‌కు ఆనంద్‌రావ్‌తో పెళ్లి ఇష్టం లేదని అర్థమవుతుంది. దీంతో ఆమె పారిపోవాలన్న ఆలోచనతో ఉంటుంది.

గ్రామపెద్ద కుమారుడు సర్జేరావ్‌.. సుమన్‌ను ప్రేమిస్తుంటాడు. కాబోయే గ్రామపెద్దకు భార్య హోదాను అనుభవించాలన్న ఆశతో సుమన్‌.. సర్జేరావ్‌కి ఆకర్షితురాలవుతుంది. సర్జేరావ్‌ వేడుక ముగిసేలోపు ఎలాగైనా సుమన్‌ను సొంతం చేసుకోవాలన్న కోరికతో ఉంటాడు. మరోవైపు సుమన్‌ ప్రేమించిన సాహెబ్‌రావ్‌ అనే యువకుడు గోంధల్‌ ప్రదర్శన కోసం మారువేషంలో ఆ ఇంటికి వస్తాడు. సాహెబ్‌రావ్‌ను చూసిన సుమన్‌ అతడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది.

సర్జేరావ్‌తో భర్తను చంపించి, ఆ నేరం అతడి మీద పడేలా చేయాలని అనుకుంటుంది. అప్పుడు ప్రియుడితో పారిపోయి సంతోషంగా బతకొచ్చని భావిస్తుంది. అయితే సర్జేరావ్‌ తనను చంపాలని అనుకుంటున్న విషయంతో పాటు, సాహెబ్‌రావ్‌ గురించి ఆనంద్‌రావ్‌కు తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందన్నది ఈ సినిమా కథ. ఇదంతా చెప్పిన ప్రధాన నటీనటులు ఎవరో చెప్పకపోతే ఎలా అనుకుంటున్నారా. ఇషితా దేశ్‌ముఖ్‌, యోగేశ్‌ సొహోని, కిశోర్‌ కదం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది నవంబరు 14న విడుదలైంది.

ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus