Hanu Man Review in Telugu: హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • తేజ సజ్జా (Hero)
  • అమృత అయ్యర్ (Heroine)
  • వరలక్ష్మి శరత్ కుమార్ , వినయ్ రాయ్ , రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ , సత్య , గెటప్ శ్రీను (Cast)
  • ప్రశాంత్ వర్మ (Director)
  • కె.నిరంజన్‌ రెడ్డి (Producer)
  • గౌరహరి , అనుదీప్ దేవ్ , కృష్ణ సౌరభ్ (Music)
  • శివేంద్ర (Cinematography)
  • Release Date : జనవరి 12, 2024

ఈ సంక్రాంతి బరిలో వామనుడిలా నిలిచిన సినిమా “హనుమాన్”. తేజ సజ్జ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. టీజర్ మొదలుకొని ప్రతి పబ్లిసిటీ కంటెంట్ సినిమా మీద మంచి అంచనాలను నమోదు చేసింది. ముఖ్యంగా.. గత కొన్ని రోజులుగా థియేటర్ల పంపిణీ విషయంలో జరుగుతున్న రచ్చ కారణంగా వార్తల్లో నిలిచిన ఈ చిత్రం సంక్రాంతి సంరంభంలో పైచేయి కోసం ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేసి ఆడియన్స్ ను వారి వైపుకు తిప్పుకున్నారు. మరి “హనుమాన్” కంటెంట్ తో ఆకట్టుకోగలిగిందా? ప్రశాంత్ వర్మ తన సత్తాను నిరూపించుకోగలిగాడా? అనేది సమీక్షలో తెలుసుకొందాం..!!

కథ: అంజనాద్రిలో చిన్నపాటి దొంగతనాలు చేస్తూ.. ఊర్లో వాళ్ళ శాపనార్ధాలు, అక్క చేత తిట్లు తింటూ టైమ్ పాస్ చేసేస్తుంటాడు హనుమంతు (తేజ సజ్జ). తాను ప్రేమిస్తున్న మీనాక్షి (అమృత అయ్యర్)ను రక్షించబోయి.. చావు దెబ్బ తిని నదిలో పడతాడు.

ప్రాణం పోయే తరుణంలో ఓ దివ్య మణి దొరుకుతుంది హనుమంతుకి. సూర్యోదయమప్పుడు హనుమంటుకి ఎనలేని శక్తినిచ్చే ఈ మణి సహాయంతో ఊరికి పీడలా పట్టిన ఓ జులుందారీ వ్యవస్థను తొక్కిపెట్టి.. అంజనాద్రికి మంచి రోజులు తీసుకొస్తాడు.

అంతా బాగుంది అనుకునే తరుణానికి అంజనాద్రిలో అడుగుపెడతాడు మైఖేల్ (వినయ్ రాయ్). హనుమంతుకి శక్తి ఎక్కడ నుండి వస్తుంది అని కనుక్కోవడమే ధ్యేయంగా మొదలైన మైఖేల్ ప్రయాణం అంజనాద్రికి ఎలాంటి ఇబ్బందులను తెచ్చిపెట్టింది? అసలు ఆ దివ్యమణి హనుమంతుకి ఎందుకు దొరికింది? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు, అంతే ఆసక్తికరంగా చెప్పిన సమాధానమే “హనుమాన్” చిత్రం.

నటీనటుల పనితీరు: తేజ సజ్జ నటుడిగా తన స్టామినా ఏమిటి అనేది నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ఈ రేంజ్ సినిమాకి తేజ ఏం సరిపోతాడు అనుకున్నవాళ్లందరికీ సమాధానం చెప్పాడు. ప్రేమ, బాధ, కోపం, హాస్యం వంటి అన్నీ ఎమోషన్స్ ను అద్భుతంగా పండించాడు. ఇక ఫైట్ సీన్స్ లో హీరోయిజంను కళ్ళతో ఎలివేట్ చేసిన తీరు ప్రశంసనీయం.
వినయ్ రాయ్ పాత్ర హాలీవుడ్ చిత్రం “సోనిక్ హెడ్జ్ హాగ్” (Sonic: The Hedgehog)లో జిమ్ క్యారీ క్యారెక్టరైజేషన్ ను మరియు “ది ఇంక్రెడిబుల్స్”లోని విలన్ భావజాలాన్ని గుర్తుచేస్తుంది. వినయ్ ఆ పాత్రలో జీవించేశాడు.

అమృత అయ్యర్ అందంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ & ఊరమాస్ ఫైట్ తో అలరించింది.

గెటప్ శ్రీను & వెన్నెల కిషోర్ లను కేవలం కామెడీ సీన్స్ కు మాత్రమే పరిమితం చేయకుండా.. వారి పాత్రలను కథన గమనానికి వినియోగించుకున్న తీరు బాగుంది.

సముద్రఖానికి చాలా రోజుల తర్వాత అర్ధవంతమైన పాత్ర లభించింది. ఎంతో బాధ్యత ఉన్న ఆ పాత్రను ఆయన చక్కగా పోషించి.. పాత్రకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టాడు.

సాంకేతికవర్గం పనితీరు: ఈ స్థాయి సీజీ వర్క్ మన తెలుగు సినిమాలో చూస్తానని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడూ హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసే రియలిస్టిక్ ఫీల్ ఇచ్చే గ్రాఫిక్స్ వర్క్ “హనుమాన్” సినిమాలోనూ ఉండడం అబ్బురపరుస్తుంది. ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ ఈ గ్రాఫిక్ వర్క్. ముఖ్యంగా.. చివరి 10 నిమిషాల్లో ఆంజనేయస్వామిని చూపించే విధానం రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్ లో ఈస్థాయి క్వాలిటీ అనేది మామూలు విషయం కాదు. కేవలం గ్రాఫిక్స్ వర్క్ లో క్వాలిటీ కోసమైనా ఈ సినిమాను థియేటర్లో చూడాలి.

దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక సాధారణ కథను, అసాధారణంగా ప్రెజంట్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు, ముదుసలివారు కూడా సినిమాను ఆస్వాదించేలా సింపుల్ ఎమోషన్స్ తో కథను నడిపించిన తీరు ప్రశంసనీయం. అలాగే.. హీరో ఎలివేషన్స్ ను రాసుకున్న విధానం బాగుంది. ఆవకాయ ఫైట్ & ప్రీక్లైమాక్స్ ఫైట్ ను డిజైన్ చేసిన తీరు మాస్ ఆడియన్స్ & పిల్లలను అమితంగా ఆకట్టుకుంటుంది. కాకపోతే.. ల్యాగ్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని సినిమాను ఓ 15 నిమిషాలు ట్రిమ్ చేయగలిగితే బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం. ఇక చివరి 10 నిమిషాల్లో ఆంజనేయస్వామిని చూపించీ చూపించనట్లుగా చూపిస్తూ.. సీక్వెల్ అయిన “జై హనుమాన్”కి ఇచ్చిన లీడ్ ఏదైతే ఉందో.. నభూతో స్థాయిలో ఉంది. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ స్థాయి మరో పదిరెట్లు పెరుగుతుందీ చిత్రంతో.

దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ వర్క్ & ఫ్రేమింగ్స్ కి మంచి పేరొస్తుంది. అలాగే.. ఆర్ట్ వర్క్ & కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. సౌండ్ డిజైనింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ లో ప్రీప్లానింగ్ కు పడిన శ్రమ కనిపిస్తుంది.

విశ్లేషణ: అత్యద్భుతంగా ప్రెజంట్ చేసిన చివరి 10 నిమిషాలు, తేజ సజ్జ స్క్రీన్ ప్రెజన్స్, మహాద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్, సముద్రఖని క్యారెక్టరైజేషన్ తో ఇచ్చిన ఎలివేషన్ & ప్రశాంత్ వర్క టేకింగ్ కోసం “హనుమాన్” సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలి. ఎందుకంటే.. రెండు నెలల తర్వాత ఒటీటీలో చూసి “ఆర్రే థియేటర్లో చూసుంటే అదిరిపోయేది కదా!” అని బాధపడకూడదు కాబట్టి. మొత్తానికి ప్రశాంత్ వర్మ & తేజ సజ్జ కలిసి సంక్రాంతి బోణీ కొట్టేశారనే చెప్పాలి. పిల్లలు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టి మెల్లమెల్లగా “హనుమాన్” వైపు మళ్లుతుంది కాబట్టి ఈ చిత్రం పెద్ద విజయం నమోదు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు.

రేటింగ్: 3.5/5

Click Here To Read in ENGLISH

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus