‘మా సినిమా థియేటర్ల కోసం తెరకెక్కించింది’.. ఈ మాట ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు. అదేంటి ఈ సినిమాను ఓటీటీలో చూడకూడదా అనే డౌట్ మీకు రావొచ్చు. మీ ప్రశ్నకు ‘ఎందుకు చూడకూడదు.. కచ్చితంగా చూడొచ్చు’ అనే ఆన్సర్ వచ్చినా అది సరైనది అయితే కాదు. ఎందుకంటే కొన్ని సినిమాలు కచ్చితంగా థియేటర్లలో చూస్తేనే ఆ మజా తెలుస్తుంది. ఈ విషయంలో మీకు ఇంకా డౌట్ ఉంటే.. ‘జైలర్ 2’ సినిమాను థియేటర్‌లోనూ, ఓటీటీలోనూ చూసిన మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వారిని అడగండి. ఏంటీ ‘జైలర్’ ఛాలెంజ్ అనుకుంటున్నారా? అవును ఇది ఛాలెంజే. అయితే ఇది అనిరుథ్ ఛాలెంజ్. ఇదంతా చెప్పాలంటే సండే సాయంత్రం మా ఇంట్లో జరిగిన ఒక సరదా సంఘటన చెప్పాలి.
థియేటర్లలో వసూళ్ల మోత మోగించి ‘జైలర్ 2’ ఇటీవల ఓటీటీకి వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ వసూళ్లలో టాప్‌లో నిలిచిన ఈ సినిమా.. ఇక్కడ రేటింగ్‌లో టాప్‌లో కనిపించింది. ఇక జరిగిన విషయానికొస్తే.. ఆదివారం కదా అని ప్రైమ్ స్క్రోల్ చేస్తుంటే టైగర్ ముత్తువేల్ పాండ్యన్ మ్యూజిక్ సన్నగా ఆటో ప్లే అయింది. దాంతో అప్రయత్నంగా రిమోట్ బటన్ ఆ సినిమా మీద క్లిక్ అయింది.. ఇంకేముందు అనిరుథ్ తన ఎలివేషన్ మ్యూజిక్‌తో చేతులు కట్టేశాడు. సినిమా ముందుకు సాగిపోయింది.
అయితే, కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందిపడ్డాను, ఇంకొన్ని విషయాల్లో సంబరపడ్డాను. ముందు సరదా సంబరాలే చూద్దాం. ఏ ఆర్‌ఆర్ కోసం అయితే థియేటర్‌లో సినిమాను రెండోసారి చూశానో.. అదిక్కడ చాలా ఈజీ అయిపోయింది. తలైవా ఎంట్రీకి అనిరుథ్ బీట్ అలా లో అవుతుండగానే రిమోట్ బ్యాక్‌బటన్ ఆటోమేటిగ్గా క్లిక్ అయిపోయింది. దాంతో మరోసారి ఆ సీన్ చూసేశాను. ఇది రజనీకి మాత్రమే కాదు.. సూరజ్ వెంజరమూడుకి, మూర్తన్న (పేరు ఇలానే గుర్తుంది)కి, కాంతా అదేనండీ విద్యా బాలన్‌కి, బోది అలియాస్ ఎస్‌జె సూర్యకి.. ఇలా అందరికీ రిపీట్ ఆప్షన్ ఇచ్చేశాను.
అంతేనా.. ఏ సీన్లకు థియేటర్‌లో మొబైల్‌లో తల దూర్చేశానో.. ఆ సీన్లను ఇక్కడ స్కిప్ కొట్టేశాను. విజయ్ సేతుపతి కాసేపే కనిపించాడని థియేటర్‌లో బాధపడగా.. ఇక్క రిపీట్ కొట్టేశా. ఇవన్నీ సంతోషాన్నిచ్చేవే. అయితే ఆనందంలోనే ఓ వెలితి తెలిసిందే. అదే వాల్యూమ్. అవును, అనిరుథ్ ఎలివేషన్‌ని ఒకట్రెండు సౌండ్‌లో చూడటం న్యాయమా. కానీ ఇంట్లో ఉన్నా కదా అలా చూశా.. సారీ చూడాల్సి వచ్చింది. అప్పుడు అనిపించింది ‘థియేటర్ ఎందుకు బెస్ట్’ అనేది. అక్కడ సౌండ్ లిమిట్ లేదు. పక్కన ఉన్న వ్యక్తి కూడా ఆ బీట్‌కి ఎంజాయ్ చేశాడు. ఇదన్నమాట మా సండే సందడి. మాకు తెలిసి మీ దగ్గరూ సేమ్ టు సేమ్.