బాహుబలి సినిమా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అంత రేంజ్ లో తెరకెక్కుతోన్న మూవీ “సైరా నరసింహారెడ్డి”. డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నిర్మాత రామ్ చరణ్ తేజ్ 300 కోట్లకుపైనే బడ్జెట్ ప్లాన్ చేశారు. తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ కోసం మెగా స్టార్ చిరంజీవి గత ఏడాది కాలంగా శ్రమిస్తున్నారు. మరో ఏడాది పాటు కష్టపడనున్నారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన చిరు… రీసెంట్ గా హోమానికి సంబంధించిన సన్నివేశాన్ని కంప్లీట్ చేసారు.
ఈ షూటింగ్ లో నయనతార, అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. తాజాగా భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పనిచేయనున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6, హ్యారీపోర్టర్, స్కై ఫాల్ వంటి అద్భుత చిత్రాలకు స్టంట్ డైరెక్టర్ గా పని చేసిన గ్రెగ్ పావెల్ సైరా చిత్రానికి వర్క్ చేయడం విశేషం. ఈ విషయాన్ని నటుడు బ్రహ్మజీ చెప్పారు. హాలీవుడ్ స్టంట్ మాన్ గ్రెగ్ పావెల్, సురేందర్ రెడ్డితో చుట్ట కాలుస్తూ ఇచ్చిన ఫోజుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సైరా యాక్షన్ మొదలైనట్లు వెల్లడించారు. ఇతని ఆధ్వర్యంలో తెరకెక్కనున్న సన్నివేశం సినిమాలో హైలెట్ కానుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.