Hotstar: సినిమా టీమ్ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్ అక్కున చేర్చుకుంది…
- February 6, 2026 / 11:54 PM ISTByFilmy Focus Desk
ఒకప్పుడు సినిమా ప్రచారం అంటే థియేటర్లలో విడుదలకు ముందు, విడుదలైన తర్వాత కొన్ని రోజులు చేసేవారు. అయితే మన సినిమా మీద ఓటీటీల ప్రభావం ఎక్కువగా పడేసరికి ఓటీటీలోకి వచ్చినప్పుడు కూడా ప్రచారం కూడా చేయడం మొదలుపెట్టారు. అయితే ఓటీటీల ప్రచారం ప్రేమ కొన్ని సినిమాల విషయంలోనే కనిపిస్తోంది. పోనీ స్టార్ హీరోల సినిమాలకే అలా చేస్తారేమో అనుకుంటే.. అందరు స్టార్ హీరోల సినిమాలకు చేయడం లేదు. అలా అని ప్రచారం చేసేవాటిలో చిన్న సినిమాలూ ఉంటున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఓటీటీ టీమ్ చేస్తున్న ప్రచారం చూస్తే.. ఇదే పని సినిమా టీమ్ చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కలుగుతోంది. ఆ సినిమానే ‘ది రాజా సాబ్’.
Hotstar
ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘ది రాసాబ్’. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈ రోజు నుండి సినిమా స్ట్రీమింగ్ కూడా మొదలైంది. అయితే దీని కోసం ఓటీటీ టీమ్ చేస్తున్న హడావుడి, ప్రచారం అయితే అభిమానులకు, సగటు ప్రేక్షకులకు కూడా నచ్చేస్తోంది అంటే అతిశయోక్తి కాదు. కావాలంటే జియో హాట్ స్టార్ సోషల్ మీడియాలో పేజీలు చూడండి మీకే అర్థమవుతుంది. సినిమా గురించి వరుస పోస్టర్లు వేస్తూనే ఉన్నారు.

సినిమా ప్రచారంలో గత కొన్ని నెలలుగా బాగా కలిసొస్తున్న అంశం ‘ఎక్స్‌టెండెడ్ కట్’. సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసినప్పుడు లేని సన్నివేశాలను ఓటీటీలోకి వచ్చినప్పుడు యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ‘ది రాజా సాబ్’ విషయంలో అదే చేశారు. ఇది మంచి ప్రచారమే. ఇక మరో పోస్టులో సినిమా ఓటీటీలోకి రాగానే నోటిఫికేషన్ వచ్చేలా ‘రిమైండ్ మి’ బటన్‌లను ఎక్కువమంది క్లిక్ చేస్తున్నారు. దీంతో సర్వర్లను అప్‌గ్రేడ్ చేశాం అంటూ సినిమాకు ఆదరణ ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇవి కొన్ని మాత్రమే.
ఇలాంటివి కాకపోయినా సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు సినిమా పని చేసిన మూడో నాలుగో పీఆర్ బృందాలు పని చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. దర్శకుడు మారుతి ఇంటికి అన్ని పార్శిల్ డెలివరీలు వచ్చేవి కావు.














