టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తోందని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. కోలీవుడ్ లో హిట్ కొట్టిన పలు చిత్రాలను నేరుగా అనువదించి తెలుగులో విడుదల చేస్తుండగా.. పలు చిత్రాలను మాత్రం రీమేక్ చేస్తున్నారు. తమిళంలో జయం రవి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘తనిఒరువన్’ తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు ఆ చిత్రాన్ని తెలుగులో ‘ధృవ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
మరోవైపు తాజాగా జయం రవి, అరవింద్ స్వామి హిట్ కాంబినేషన్లో ‘బోగన్’ చిత్రం తెరకెక్కుతుండగా.. ఈ చిత్ర డబ్బింగ్ హక్కుల కోసం నిర్మాతలు పోటీ నడవటమే కాకుండా.. ఫ్యాన్సీ రేట్లు ఇచ్చేందుకు సైతం నిర్మాతలు వెనకాడటం లేదని టాక్. కాగా ఇటీవలే తమిళంలో ‘పిచ్చైకారన్’ పేరుతో విడుదలైన చిత్రం నేరుగా తెలుగులో ‘బిచ్చగాడు’ గా అనువాదమై మంచి విజయాన్ని అందుకోంది.
సత్యరాజ్ ప్రముఖ పాత్రలో తెరకెక్కుతున్న ‘జాక్సన్ దురై’ కూడా తెలుగులో దొర పేరుతో విడుదల అవనుంది. తమిళంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుడటంతోనే నిర్మాతలు డబ్బింగ్ హక్కుల కోసం పోటీ పడుతున్నారని పలువురు అంటున్నారు.