ఎప్పుడు సినిమా పోతుందా.. ఎప్పుడు కామెంట్ చేద్దామా అని ఎదురుచూస్తుంటారు మన టాలీవుడ్‌లో. మంచి సినిమా తీసి.. వసూళ్లు రాకపోతే.. ఆ కష్టం వృథా అయినట్లే అని అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే సినిమా ఫలితం కాస్త అటూ ఇటూ అయితే.. ఆ హీరో మీద, దర్శకుడి మీద బకెట్ల బకెట్ల బురద పోసేస్తుంటారు. ఈ మాటలు టాలీవుడ్ జనాలకు కాస్త నొప్పించొచ్చు కానీ.. ఇవి నిజం. కావాలంటే ‘పెద్ది’ సినిమా సమయంలో హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా గురించి తూలనాడి మాట్లాడినవారిని గుర్తుకు తెచ్చుకుండి.
ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడెందుకు ఈ చర్చ అనుకుంటున్నారా? ఇంకెందుకు ‘టాక్సిక్’ సినిమా వచ్చింది కాబట్టి. ఆ సినిమాకు, టాలీవుడ్‌కి ఏం సంబందం అనుకుంటున్నారా? నిజానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఓ సినిమా వచ్చి, అందులోని ఏవో కొన్ని అంశాలపై బేధాభిప్రాయాలు రాగానే సొంత పరిశ్రమలోని వారే కత్తులు నూరడం సరికాదు అని నేర్పిన సినిమా అది. ‘టాక్సిక్’ సినిమా భారీ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయితే యశ్ నటనను ప్రశంసిస్తున్నారు చాలామంది.
అందులో సినిమా ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్, రిషభ్ శెట్టి సినిమాకు, యశ్‌కు పూర్తి మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు సీనియర్ నటి సుమలత ఈ సినిమాపై స్పందించారు. ‘టాక్సిక్’ సినిమా చూశానని చెబుతూ యశ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. యశ్.. నువ్వు ఏ విషయానికీ భయపడకుండా ధైర్యంగా ఇక్కడి దాకా వచ్చావు. ఈ సినిమాలో నీ నటన అద్భుతం. నీ కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని రాసుకొచ్చారు.
నువ్వు ముందుచూపు ఉన్న వ్యక్తివి. వివేకంతో ఆలోచిస్తావు. ఇప్పుడు అలానే ఆలోచించు. సినిమాపై వచ్చే విమర్శలను పట్టించుకోకు. బహుశా ‘టాక్సిక్’ ఇప్పుడు రావాల్సిన సినిమా కాదేమో.. భవిష్యత్తులో విడుదలవ్వాల్సిందేమో. నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు, ఈ చిత్రాన్ని అర్థం చేసుకోలేని ట్రోల్ చేస్తున్నారు. మన విజయం పక్కవారికి అసూయగా ఉంటుందని గమనించు. భవిష్యత్తులో ‘కేజీఎఫ్’ను మించిన హిట్ అందుకుంటావని ఆశిస్తున్నా అని అందులో రాసుకొచ్చారు.
ఇప్పుడు చెప్పండి టాలీవుడ్‌లో ఓ సినిమా పోయి, హీరోకు మంచి పేరొస్తే.. ఇలా సపోర్టు వచ్చిందా? రాలేదు కదా.. కాబట్టి శాండిల్ వుడ్ మనకంటే చిన్న పరిశ్రమే అవ్వొచ్చు. కానీ ఇలాంటి విషయాల్లో చాలా పెద్ద పరిశ్రమ.