“నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను” లాంటి చిత్రాలతో 90లలో లవర్ బోయ్ గా యువ హృదయాల్లో చెరగని సంతకం చేసిన తరుణ్ చాలా ఏళ్ల విరామం అనంతరం మరోమారు కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం చేసిన సినిమా “ఇది నా లవ్ స్టోరీ”. కన్నడలో ఘన విజయం సాధించిన “సింపుల్ ఆగ్ ఓండ్ లవ్ స్టోరీ” అనే చిత్రానికి రీమేక్ ఇది. మరి కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : అభిరామ్ (తరుణ్) జీవితంలో ఏ విషయం మీద కూడా సీరియస్ నెస్ అనేది లేకుండా నచ్చింది చేసుకుంటూ.. కెరీర్ గురించి పెద్దగా పట్టించుకోకుండా తిరిగేసే యువకుడు. ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా కూడా కేర్ చేయకుండా ఉంటాడు. తొలిచూపులోనే రోడ్డు మీద కనిపించిన ఒకమ్మాయిని ప్రేమించి.. కొన్నాళ్లపాటు సరససల్లాపాలు సాగించి అమ్మాయికి పెళ్లి సెటిల్ అవ్వడంతో ఆమెను వదిలేసి సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీ పెట్టుకొని సరికొత్త జీవితం ప్రారంభిస్తాడు. కట్ చేస్తే.. జీవితం సాఫీగా సాగుతుండగా తన చెల్లెలు బలవంతం మీద అరకులో ఒకమ్మాయిని చూడ్డానికి వెళతాడు. డాక్టర్ శృతి అనే అమ్మాయిని కలవడానికి వెళ్ళిన అభిరామ్ అక్కడ అభినయ (ఓవియా)ను కలుస్తాడు. తను కలవాల్సిన అమ్మాయి తను కాకపోయిన నచ్చడంతో ఆమెనే పెళ్లాడాలనుకొంటాడు. మళ్ళీ కట్ చేస్తే.. ఒకరోజు మొత్తం అభిరామ్ తో ఎంతో స్నేహంగా ఉండడంతోపాటు సరసాలు కూడా ఆడిన అభినయ ఉదయం నిద్రలేవగానే కోపంగా అరుస్తూ పోలీసుల చేత అభిరామ్ ను అరెస్ట్ చేయిస్తుంది. అభిరామ్ ను అభినయ ఎందుకు అరెస్ట్ చేయించింది? అనేది తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు : తరుణ్ ఇంకా “నువ్వే నువ్వే” దగ్గరే నటుడిగా ఆగిపోయాడు. డైలాగులు చెప్పే విధానం మొదలుకొని యాటిట్యూడ్ అన్నీ ఆ సినిమాలోలాగే కనిపిస్తాయి. దాదాపు ఒక ఎనిమిదేళ్ళ తర్వాత ఒక పూర్తి స్థాయి హీరోగా మళ్ళీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైన తరుణ్ ఈ విధంగా తన నటన పరంగా ఎలాంటి కొత్తదనం చూపించకపోవడం గమనార్హం. తమిళ “బిగ్ బాస్” షోతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న ఓవియాను ఈ సినిమాలో చూస్తే.. “ఈమెకు అంతమంది ఫ్యాన్స్ ఎందుకు?” అనే డౌట్ వస్తుంది. అందాల ఆరబోత మినహా ఏ ఒక్క విషయంలోనూ ఆమె కథానాయిక అనే ఆలోచన కూడా ప్రేక్షకులకు రాదు. పైగా.. ఆమె మేకప్ 90లలో వ్యాంప్ క్యారెక్టర్స్ ను తలపించడం విశేషం. వీరిద్దరు కాకుండా సినిమాలో మరో అయిదారుగురు ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సాంకేతికవర్గం పనితీరు : పాటలు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డి.ఐ, కలరింగ్ వంటి సాంకేతిక పరమైన విషయాలన్నీ సోసోగా ఉన్నాయి. అయితే.. వాటన్నిటికంటే ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది సినిమాలోని డైలాగుల గురించి. వాట్సాప్ అందుబాటులోకి రాకముందు ఫార్వార్డ్ మెసేజుల్లో వచ్చే సోది మాటలు, మరియు “జోకుల పుస్తకాలు” పేరిట బస్టాండుల్లో అమ్మే బుక్స్ లో నుంచి కలెక్ట్ చేసిన జోకులన్నీ కలిపి “ఇది నా లవ్ స్టోరీ”లో మాటలుగా చెప్పించడం అనేది ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించట్లయింది. సినిమా మొత్తానికి ఒకటో రెండో మహా అయితే సందార్భానుసారంగా అప్పుడప్పుడు పంచ్ డైలాగ్స్ అనేవి వినిపిస్తే వినడానికైనా బాగుండేదేమో. కానీ.. సినిమా మొత్తం పంచ్ లే అంటే వినడానికి ఎంత చిరాగ్గా ఉంటుందో.. చూడ్డానికి కూడా అంతే చిరాగ్గా ఉంటుంది. ఆ డైలాగ్స్ అన్నీ కలెక్ట్ చేసిన తప్పకుండా ఒక సపరేట్ ఆర్టికల్ వీలైనంత త్వరలోనే మీకు అందిస్తాం.
ఇక దర్శక ద్వయం రమేష్-గోపిలు ఈ చిత్రంతో దర్శకులుగా పరిచయమవ్వడానికి ముందు ఎవరి దగ్గర లేదా ఏ సినిమాకి వర్క్ చేశారో తెలియదు కానీ.. సినిమా మొత్తంలో “ఈ సీన్ బాగుంది” అని సగటు ప్రేక్షకుడు చెప్పుకొనే తరహాలో ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం బాధాకరం. పాపం ఇన్నాళ్ల తర్వాత కథానాయకుడిగా రీఎంట్రీ ఇద్దామనుకొన్న తరుణ్ ఆశలు ఆవిరి చేయడంతోపాటు.. ఆ ఆవిరి ప్రేక్షకుల సీట్ల కింద పెట్టి కుర్చీలో వారిని కూడా కుదురుగా కోర్చోనివ్వకుండా వారి సహనంతో ఫుట్ బాల్, బుర్రలతో బాస్కెట్ బాల్ ఆడేశారు ఈ దర్శకులిద్దరూ కలిసి.
విశ్లేషణ : ఇంత రాసిన తర్వాత మళ్ళీ సినిమాని ఇంకేం విశ్లేషించాలో తెలియట్లేదు. సో, ఇదంతా చదివాక సినిమాకి వెళ్లాలా లేక తరుణ్ మీద అభిమానంతో ఆయన పాత సినిమాలు యూట్యూబ్ లో చూసి సంతోషించాలా అనేది ప్రేక్షకుల మరియు మా రివ్యూ చదువుతున్న వీక్షకుల మనోభీష్టానికే వదిలేస్తున్నాం.
రేటింగ్ : 1/5