ప్రముఖ సంగీత దర్శకుడు, ఇసైజ్ఞాని ఇళయరాజా ఇంట విషాదం అలముకుంది. ఆయన కుమార్తె భవతరిణి గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న భవతరిణి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శ్రీలంకలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం సాయంత్రం 5.20కి కన్నుమూశారు అని కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. ఇళయరాజా కూతురు అని కాకుండా.. సొంతంగా తన టాలెంట్‌తో పేరు తెచ్చుకున్నారామె. జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు.
2001లో షాయాజీ షిండే ప్రధాన పాత్రలో వచ్చిన ‘భారతి’ అనే సినిమాలో ‘మాయిల్ పోలా పొన్ను…’ అనే పాట పాడినందుకు భవతరిణికి జాతీయ పురస్కారం అందించారు. తెలుగులో భవతారిణి కంపోజ్ చేసిన ‘అవునా’ అనే సినిమా పాటలకు మంచి పేరు వచ్చింది. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. 2002లో రేవతి దర్శకత్వంలో వచ్చిన ‘మిత్ర మై ఫ్రెండ్’ సినిమాతో భవతరిణి సంగీత దర్శకురాలిగా మారారు. ఇక ‘మాయానది’ అనేది ఆమె చివరి చిత్రం.
ఇళయరాజా సంగీతం అందించిన ‘రాసయ్య’ అనే సినిమాతో ఆమె తమిళంలో గాయనిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగులోనూ పాటలు పాడారు. లక్ష్మి మంచు, ఆది పినిశెట్టి, తాప్సిల సినిమా ‘గుండెల్లో గోదారి’లో ఆమె ‘నన్ను నీతో నిను నాతో కలిపింది గోదారి’ అనే పాట పాడారు. తమిళంలో ‘ఫ్రెండ్స్’, ‘పా టైమ్ ఓరు నాళ్ ఒరు కనవు’, ‘అనేగన్’ చిత్రాల్లోనూ పాటలు పాడారు.
సంగీత దర్శకురాలిగా ‘ఫిర్ మిలేంగే’, ‘ఇలక్కనమ్’, ‘వెల్లాచి’, ‘అవునా’ వంటి చిత్రాలకు సంగీత దర్శకురాలిగా వ్యవహరించారు. భవతరిణి భర్త పేరు శబరి రాజ్. ఆయన ఓ యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తుంటారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం చెన్నైలో జరుగుతాయి అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ జనాలు సంతాపం ప్రకటించారు. ఇళయారాజాకు (Ilaiyaraaja) సన్నిహితులు ధైర్యం చెబుతున్నారు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!