హైదరాబాద్‌కి ఎవరైనా కొత్తగా వస్తే.. అందులోనూ సినిమా అంటే పిచ్చి ఉన్నవారు వస్తే.. కచ్చితంగా వారి నోట వినిపించే మాట ‘ఐమ్యాక్స్‌కి వెళ్దామా’. అంతలా ఐమ్యాక్స్ అంటే ఆసక్తి ఉండేది. అలాంటి ఐమ్యాక్స్ హైదరాబాద్‌లో కొన్నేళ్ల క్రితం తీసేశారు. దీంతో మన సినిమాలు అంతర్జాతీయ స్థాయికి వెళ్లి లార్జర్ దేన్ లైఫ్ సినిమాలు అని పేరు తెచ్చుకుని.. అదిరిపోయే నాణ్యతతో అక్కడ ప్రదర్శితం అవుతున్నా.. ఆ క్వాలిటీతో మనం ఇక్కడ సినిమాలు చూడలేకపోతున్నాం. అయితే ఇప్పుడు వెయిటింగ్‌కి త్వరలో తెరపడనుంది.
సినిమా ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు లార్జర్ దేన్ లైఫ్ వినోదాన్ని పంచిన ఐమ్యాక్స్ ఫార్మాట్ మళ్లీ అందుబాటులోకి రాబోతోంది. ఏఎంబీ సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్, ఐమ్యాక్స్ సంయుక్తంగా ఐమ్యాక్స్ స్క్రీన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 70ఎంఎం థియేటర్‌ను ఇప్పుడు ‘ఏఎంబీ క్లాసిక్ విక్టరీ’ పేరుతో సాంకేతికంగా అత్యున్నతంగా తీర్చిదిద్ది సిద్ధం చేశారు.
అయితే ఏ ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను తీసుకొస్తారు అనేది కీలకంగతా మారింది. ఫ్లాట్ ఐమ్యాక్స్ స్క్రీన్ 1.90:1 రేషియోలో ఉంటుంది. ట్రూ ఐమ్యాక్స్ (ఐమ్యాక్స్ గ్రాండ్ థియేటర్) రేషియో 1:43:1. విదేశాల్లో ఇలాంటి స్క్రీన్‌లు ఉన్నాయి. మనదేశంలో అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీలో ట్రూ ఐమ్యాక్స్ ఉంది. ఇప్పుడు ‘ఏఎంబీ క్లాసిక్ విక్టరీ’లో ఏ రేషియో స్క్రీన్ ఏర్పాటు చేస్తారనేది చూడాలి.
ఇండియన్ సినిమాలో ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలో ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో వరుస సినిమాలు రాబోతున్నాయి. మహేష్‌బాబు – రాజమౌళి ‘వారణాసి’, ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’, అల్లు అర్జున్ – అట్లీ ‘రాకా’ లాంటి ఈ ఫార్మాట్‌లో రిలీజ్ చేస్తారని టాక్. ఇక ‘వారణాసి’ సినిమాలో కీలక సన్నివేశాలను ట్రూ ఐమ్యాక్స్‌లో చిత్రీకరిస్తున్నామని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. మరి ఏ సినిమాతో ఏఎంబీ క్లాసిక్ విక్టరీ స్టార్ట్ అవుతుందో చూడాలి..